హెలికాఫ్టర్ ప్రమాదంలో రాఫెల్ విమానాల సంస్థ ఓనర్ మృతి.. 

భారత్ కు అత్యంత శక్తిమంతమైన రాఫెల్ యుద్ధ విమానాలను సరఫరా చేసిన ఫ్రాన్స్ సంస్థ డస్సాల్ట్ ఏవియేషన్ అధినేత ఒలీవర్‌ డస్సాల్ట్‌ ‌(69) ఒక హెల్‌కాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఫ్రాన్స్‌లో అత్యంత సంపన్నులలో ఒకరైన ఒలివియర్... కన్సర్వేటివ్ పార్టీ ఎంపీ కూడా. వాయవ్య ఫ్రాన్స్‌లోని నార్మండి ప్రాంతంలో ఆ దేశ కాలమానము ప్రకారం ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఒలివియర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కుప్పకూలిందని తెలిసింది. ఈ ప్రమాద ఘటనలో ఒలీవర్‌తో పాటు పైలెట్‌ కూడా మృతి చెందాడు. హెలికాప్టర్‌ ప్రమాదం జరిగిన నార్మండీలో ఒలివియర్‌కి ఒక హాలిడే హోమ్ ఉంది. అక్కడికి వెళ్తున్నప్పుడే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఒలివియర్‌ మృతిపై ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్‌ మాక్రాన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. ఫ్రాన్స్‌ను ఎంతగానో ప్రేమించే ఒలీవర్‌ మృతి దేశానికి తీరని లోటని పేర్కొన్నారు.

కరిగిల్ యుద్ధ సమయంలో భారత్ కు ఎంతగానో సేవలందించిన మిరాజ్ యుద్ధ విమానాలను తయారు చేసింది కూడా డస్సాల్ట్ ఏవియేషన్స్ కావడం గమనార్హం. ఈ డస్సౌల్ట్‌ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇది ఇలా ఉండగా ఫోర్బ్స్ పత్రిక తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచంలోని బిలీనియర్ల జాబితాలో 361వ స్థానంలో ఒలీవర్ ఉన్నారు. ఈయన సంపద 6.3 బిలియన్ యూరోలు. అంతేకాకుండా రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత ఒలీవర్ తన కంపెనీ బోర్డ్ నుండి కూడా తప్పుకుని .. తనకు ఎలాంటి మచ్చా లేకుండా చూసుకున్నారు. ఒలీవర్ డస్సాల్ట్‌కు ముగ్గురు పిల్లలు.