బీజేపీ రాహుల్ గాంధీని తక్కువ అంచనా వేస్తుందా?

 

లోక్ సభ ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్‌గా భావించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నిన్న వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫలితాలు కొన్ని పార్టీల్లో సంతోషాన్ని నింపితే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మాత్రం షాక్ తగిలేలా చేశాయి. ఏ రాష్ట్రంలోనూ బీజేపీ పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని కొనసాగించలేకపోయింది. తెలంగాణలో ఓటర్లు టీఆర్ఎస్ కి బ్రహ్మరధం పట్టి మళ్ళీ అధికారం కట్టబెట్టారు. ఇక్కడ బీజేపీ ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే టీఆర్ఎస్ ని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, టీజేఎస్, సీపీఐ వంటి పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడింది. కానీ కూటమికి ఓటమి తప్పలేదు. కూటమి పార్టీలతో కలిసి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుంది అనుకుంటే. గత ఎన్నికల్లో చూపిన మాత్రం ప్రభావం కూడా చూపలేక చతికిలపడిపోయింది. కాంగ్రెస్ కి మిజోరంలో కూడా ఇలాంటి ఫలితమే ఏర్పడింది. ఈశాన్య రాష్ట్రాల్లో మిజోరంను కాంగ్రెస్ కంచుకోటగా భావిస్తారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ 5 స్థానాలతో సరిపెట్టుకొని అధికారం పోగొట్టుకుంది. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కి చేదు ఫలితాలు ఎదురైనా మిగతా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. సెమీఫైనల్స్‌ లో బీజేపీకి షాక్ ఇచ్చి ఫైనల్స్ కి సిద్ధమైంది.

ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్, బీజేపీ ల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్టు సాగుతుంది అనుకున్నారు. కానీ ఫలితాలు మాత్రం వార్ వన్ సైడ్ అని తేల్చేశాయి. ఇక్కడ 90 సీట్లకు గాను కాంగ్రెస్ 68 సీట్లు గెలుచుకొని జెండా ఎగరేసింది. బీజేపీకి కంచుకోటల్లాంటి రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో కూడా కాంగ్రెస్ సత్తా చాటింది. రాజస్థాన్ లో 199 సీట్లకు గాను కాంగ్రెస్ 100 సీట్లు గెలుచుకుంది. ఇక మధ్యప్రదేశ్ విషయానికొస్తే 230 సీట్లకు గాను 114 సీట్లు గెలుచుకుంది. ఈ మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ తన సత్తా చాటి బీజేపీని అధికారానికి దూరం చేసింది. పేరుకివి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలైనా మోదీ, రాహుల్ గాంధీ మధ్య పోరులా సాగింది. ఎందుకంటే పీఎం ఎన్నికలకు ముందు వీటిని సెమీఫైనల్స్‌గా భావించారు. ప్రచారంలో కూడా మోదీ, రాహుల్ పోటాపోటీగా పాల్గొన్నారు. రాహుల్ ని పప్పు అని, రాహుల్ ప్రచారం చేస్తే కాంగ్రెస్ ఓడిపోతుందని బీజేపీ విమర్శలు చేస్తూ వస్తుంది. అయితే ఫలితాలు చూస్తే మాత్రం బీజేపీ రాహుల్ ని తక్కువ అంచనా వేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఈ మూడు రాష్ట్రాల ఫలితాలతో రాహుల్ బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చినట్లు అయింది. ఇన్ని రోజులు బీజేపీకి తిరుగులేదు, మోదీ లాంటి బలమైన నేత కాంగ్రెస్ లో లేరని బీజేపీ భావించింది. కానీ రాహుల్ రోజురోజుకి పరిణితి చూపిస్తూ పప్పు కాదు నిప్పు అని రుజువు చేసుకుంటున్నాడు. ఇది కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. మరి రాహుల్ సెమీఫైనల్స్‌ లో షాక్ ఇచ్చినట్లే ఫైనల్స్ లో కూడా మోదీకి షాక్ ఇస్తారా?. చూద్దాం ఏం జరుగుతుందో.