ఇదెక్కడి సదస్సు?

 

First World Agriculture Forum, World Agriculture Forum,World Agriculture Congress

 

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైలెవల్లో నిర్వహిస్తున్న ప్రపంచ వ్యవసాయ సదస్సు మంగళవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో మొదలైంది. ఈ సదస్సులో ప్రపంచ దేశాల నుంచి అనేకమంది రైతులు ప్రతినిధులుగా పాల్గొంటారట. ఈ సదస్సు గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో భారీ స్థాయిలో ప్రచారం చేసింది. రాష్ట్రం నలుమూలల నుంచి రైతులు ఈ సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.

 

 

ప్రభుత్వం పిలిచింది కదా అని రాష్ట్రం నలు మూలల నుంచి రైతులు మంచి పంచె కట్టుకుని, తలపాగా పెట్టుకుని సదస్సుకు వచ్చారు. అప్పటిగ్గానీ రాష్ట్ర ప్రభుత్వం తెలివితేటలు రైతులకు అర్థం కాలేదు. ఇది ప్రపంచస్థాయి సదస్సు కాబట్టి రైతులు డబ్బులు కట్టి సదస్సులో పాల్గొనాలంట. అంతగా కావాలంటే సదస్సు పక్కనే ఏర్పాటు చేసిన వ్యవసాయ స్టాల్స్‌ చూసి వెళ్ళిపోవచ్చంట. వ్యవసాయ సదస్సులో రైతులు డబ్బు కట్టి పాల్గొనడం ఏ విధానమో అర్థంకాక రైతులు అయోమయంలో పడిపోయారు. చాలామంది రైతులు సదస్సుకు వచ్చారు. అయితే వారిని స్టాల్స్ చూసి వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పారు.




ఖమ్మం జిల్లా నుంచి 400 మంది రైతులు సదస్సులో పాల్గొనాలని హైదరాబాద్‌కి ఖర్చులు పెట్టుకుని మరీ వస్తే, వారిని సదస్సు వరకు కూడా రానివ్వకుండా హైదరాబాద్ శివార్ల నుంచే వెనక్కి పంపేశారు. అదేంటయ్యా అని అడిగితే, డబ్బులిచ్చి సదస్సులో పాల్గొనే సత్తా వుంటే రావొచ్చని అధికారులు చెప్పారు. ఈ విషయంలో రైతులు వ్యవసాయ శాఖ మంత్రికి, ముఖ్యమంత్రికి రైతులు మొర పెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రభుత్వం ఎంపిక చేసిన 50 మంది రైతులకు మాత్రమే సదస్సులోకి ఉచిత ప్రవేశం ఉందట. మిగతా అందరూ వేలకు వేలు ప్రవేశ రుసుము చెల్లించి సదస్సులో పాల్గొనాలని మంత్రి, ముఖ్యమంత్రి చావుకబురు చల్లగా చెప్పినట్టు చెప్పారు. దాంతో కంగు తిన్న రైతన్నలు ఇంటిదారి పట్టారు.




ఈ సదస్సులోనే ‘చిన్న కమతాలు అభివృద్ధి చేయడం ఎలా?’ అనే అంశం మీద చర్చా కార్యక్రమం కూడా వుందట. చిన్న రైతులు లేకుండా పెద్ద రైతులే దీని గురించి చర్చిస్తారేమో! మూడు రోజులపాటు జరిగే ఈ వ్యవసాయ సదస్సులో ముఖ్యమంత్రి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితోపాటు అనేకమంది అధికారులు, విదేశీ రైతులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, యువతరం వ్యవసాయ రంగంలోకి రావడం లేదని వాపోయారట. రైతుల విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు చూస్తే ఆసక్తి వున్నవారు కూడా వ్యవసాయ రంగంలోకి రారు. ముందు ప్రభుత్వాల తీరు మారాలి. ఆ తర్వాతే ఎదుటివారికి నీతులు చెప్పాలి.