ఈవీఎంలతో దగా చేస్తారా?

 

ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి. అటు రాష్ట్రంలో, ఇటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మట్టి కరుచుకుని పోయే అవకాశాలు నూటికి నూరుశాతం కనిపిస్తున్నాయి. ఓటర్లు కాంగ్రెస్ పార్టీని ఇంటికి, కాంగ్రెస్ అధినేతి సోనియా గాంధీని పుట్టింటికి పంపడానికి పూర్తిగా ప్రిపేర్ అయి వున్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లోనూ టీడీపీ అనే అంచనాలకు రాజకీయ పరిశీలకులు వచ్చేశారు. ఈ నేపథ్యంలో అధికారం నిలుపుకోవడానికి ఎలాంటి అడ్డదారులైనా తొక్కడానికి సిద్ధమయ్యే కాంగ్రెస్ పార్టీ అనేక కుట్రలు, కుతంత్రాలకు శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయనే అనుమానాలు అంతటా వ్యక్తమవుతున్నాయి.

 

కాంగ్రెస్ కుట్ర చేసి, ఓటర్లను దగా చేయడానికి అవకాశం వున్న ప్రధాన అంశం ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ పార్టీకి ఓటు వేసినా ఆ ఓటు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడే విధంగా ఈవీఎంలను కాంగ్రెస్ పార్టీ ‘తీర్చిదిద్దే’ ప్రమాదం వుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మనం ఓట్లు వేసే ఈవీఎంలు శత్రు దుర్భేద్యమైన కోటలేం కాదు. కాస్తంత ఎలక్ట్రానిక్ పరిజ్ఞానం వున్న ఎవరైనా వాటితో ఫుల్లుగా ఆడుకోవచ్చు. తమకు ఇష్టమొచ్చిన విధంగా వాటిని వాడుకోవచ్చు. ఈవీఎంలను ఏరకంగానైనా పనిచేయించవచ్చన్న అభిప్రాయాలను అనేకమంది సాంకేతిక నిపుణులు వ్యక్తం చేశారు. ఈవీఎంలను నమ్మడానికి ఎంతమాత్రం వీలు లేదని వారు స్పష్టంగా చెప్పారు.

 

ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలను తనకు అనుకూలంగా మార్చే కుట్రకు తెరతీసే అవకాశం వుందన్న అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏం పర్లేదు ఎన్నికల సంఘం వుంది కదా అని అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎన్నికల సంఘం మంచిదే. కానీ అందులో పనిచేసేవారిని నమ్మాల్సిన అవసరం లేదు. ఎవరు ఎలా ఆడిస్తే అలా ఆడే ఈవీఎంలను అస్సలు నమ్మాల్సిన అవసరం లేదు. అందువల్ల ఈవీఎంల నిర్వహణ మరింత పారదర్శకంగా, మరింత బాధ్యతాయుతంగా, మోసాలు జరగడానికి వీలు లేకుండా వుండే విధంగా ఏ చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలను ఎన్నికల సంఘం తీసుకోవాల్సిన అవసరం వుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.