గల్లీ టు డిల్లీ .... ఎనీ సెంటర్ .. ఎనీ పార్టీ..

 

విడిపోయే ముందు రాష్ట్రానికి ఎన్నికలు ఎక్కువయ్యాయి. అదే సమయంలో పార్టీలు కూడా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. గల్లీ టు డిల్లీ .... ఎనీ సెంటర్ .. ఎనీ పార్టీ.. నుంచి పోటీ చేసే అవకాశాలు అంగడిలోకి వచ్చి పడ్డాయి. ఆలసించినా .. ఆశాభంగం.. మంచి తరుణం మించిన దొరకదు. పార్టీ జెండాలు భుజాన వేసుకుని కాళ్ళరిగేలా తిరిగిన కార్యకర్తలకు ఎట్టకేలకు ఎన్నికల కదన రంగంలోకి దూకే అవకాశం అంది వచ్చింది.

 

నల్లారి నాన్చుడుతోనే..

తాజా మాజీ ముఖ్యమంత్రి నల్లారి నాన్చుడు ధోరణి పుణ్యమా అని ఎప్పటి నుంచో నిర్వహించకుండా అట్టిపెట్టిన మున్సిపల్, జెడ్పీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఇచ్చింది. మరో పక్క సార్వత్రిక ఎన్నికలతోపాటే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 30న మున్సిపల్ ఎన్నికలు, ఏప్రిల్ 6న జెడ్పీ.. మండల ఎన్నికలు? (ఇంకా షెడ్యూల్ విడుదల కాలేదు), ఏప్రిల్ 30న తెలంగాణలో.. మే 7న సీమాంధ్రలో లోక్ సభ, శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. 5 వారాల తేడాలో 5 రకాల ఎన్నికలను అధికారులు నిర్వహించబోతున్నారు.

 

ఒక్క మన రాష్ట్రంలోనే ఎన్నికల నిర్వహణకు వేలకోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒకటి కాకపోతే .. ఇంకొకటి ... ఏళ్ళు తరబడి.. వార్డు నుంచి ఎంపీ స్థానం వరకూ నేతలు పాతుకు పోయారు. కొత్త పార్టీలు లేవు. ఏ ఎన్నిక జరిగినా.. ఓడినా, గెలిచినా వారే అభ్యర్ధులు. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు వరుస ఎన్నికలు, కొత్త కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి. డబ్బుంటే చాలు.. మా పార్టీ టికెట్ ఇస్తాం అంటూ అభ్యర్ధులు వెంట పార్టీ తిరిగే పరిస్థితి. డబ్బు, ఆశక్తి ఉండాలే గాని, కార్పొరేటర్ గా ఓడిపోతే .. ఎంపీటీసీ/జెడ్పీటీసీగా పోటీ చేయొచ్చు. ఇక్కడా గెలవకపోతే ఎమ్మెల్యే/ఎంపీగా పోటీ చేశే అవకాశమూ మిగిలే ఉంది.