ఏపీకి అప్పులే దిక్కా? ఆర్ధిక పతనానికి జగన్ విధానాలే కారణమా?

 

ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రాష్ట్ర ఆదాయం ఊహించనిస్థాయిలో గణనీయంగా పడిపోయింది. నాలుగు నెలలుగా రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయం ఆశించినమేర రాలేదు. ఒకవైపు ఖర్చుల భారం పెరగడం... మరోవైపు కేంద్రం నుంచి ప్రత్యేక సాయం అందకపోవడంతో... ఆ ప్రభావం తప్పనిసరిగా అమలుచేయాల్సిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై పడుతోంది. అయితే, ఊహించనివిధంగా గాడితప్పుతోన్న ఆర్ధిక వ్యవస్థను దారిలోపెట్టేందుకు ఏం చేయాలో తెలియక ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ అయోమయంలో పడింది.

వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంపులు, రవాణాశాఖలపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ కు ...అధికారులు కళ్లు బైర్లు కమ్మే నిజాలు చెప్పారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆదాయం భారీగా తగ్గిపోయిందని లెక్కలతో సహా వివరించారు. ముఖ్యంగా ఇసుక నిలిపివేత, బెల్టుషాపుల రద్దు... ఏపీ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించాయని వివరించారు. లిక్కర్ వినియోగం గణనీయంగా తగ్గిపోవడంతో ఆదాయం కూదా అదే స్థాయిలో పడిపోయిందని తెలిపారు. ఇక ఇసుక నిలిపివేతతో నిర్మాణరంగం కుదేలైందని, అదే-సమయంలో సిమెంట్, ఐరన్ రేట్లు తగ్గడంతో పన్ను రాబడి పతనమై రాష్ట్ర ఖజానాకు దెబ్బపడిందన్నారు. అలాగే వాహన రంగంలో మంద గమనంతో జీఎస్టీ తగ్గిందని వివరించారు. మొత్తంగా వాణిజ్య పన్నుల్లో 14శాతం వృద్ధి ఉండాల్సి ఉండగా, కేవలం 5.3శాతం మాత్రమే నమోదైందని అధికారులు లెక్కతేల్చారు. అంటే రావాల్సిన దానికంటే 8.7శాతం ఆదాయం తగ్గిందని ముఖ్యమంత్రికి వివరించారు. ఇది భారీ మొత్తం కావడంతో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది.

అయితే, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో కొత్త ఆదాయ వనరులపై దృష్టిపెట్టాలని, కొత్త మార్గాలను ఆన్వేషించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. అలాగే, సెప్టెంబర్ రెండు నుంచి రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండటంతో... ఆ సమయానికల్లా సామాజిక పెన్షన్ల పంపిణీకి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అయితే, ఈ ఆర్ధిక సంవ్సరం చివరి నాటికి ఆదాయాలు మెరుగుపడతాయని, అనుకున్నమేర 14శాతం వృద్ధిని సాధిస్తామని అధికారులు చెప్పుకొచ్చారు. ఇక సెప్టెంబర్లో జీఎస్టీ పరిహారం కింద సుమారు 6వందల కోట్లు వస్తాయని సీఎంకు  తెలియజేశారు 

అయితే, ఆర్ధిక మాంద్యంతో ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి అంత ఈజీగా మెరుగుపడే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. పతనమవుతున్న ఆర్ధిక వ్యవస్థకు ఏపీ పరిస్థితి అద్దం పడుతోందని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితికి జగన్ ప్రభుత్వ విధానాలూ ఒక కారణమంటున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు ఆర్ధిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలంటే అప్పులు చేయక తప్పదని చెబుతున్నారు.