ఆమె గురించి కాంగ్రెస్ ఇప్పుడు ఏమంటోందంటే...


 

ముంబై దాడులలో ప్రధాన సూత్రధారి అయిన డేవిడ్ హెడ్లీ ముంబై కోర్టుకి రోజుకో నిజాన్ని వెల్లడిస్తున్నాడు. పాకిస్తాన్‌ గూఢచారి వ్యవస్థకీ తీవ్రవాద సంస్థలకూ సంబంధాలున్నాయనీ, తాను భారతదేశానికి చాలా సార్లు వచ్చి వెళ్లాననీ... ఇలా హెడ్లీ చెబుతున్న వివరాలు కొత్తవే అయినా ఆశ్చర్యం కలిగించేవి ఏవీ కావు. కానీ ఇవాళ హెడ్లీ విచారణలో వెల్లడించిన ఒక అంశం తప్పకుండా అటు కాంగ్రెస్‌కి ఇబ్బందినీ, బీజేపీకి సంతోషాన్నీ ఏకకాలంలో కలిగించేదిగా ఉంది. గుజరాత్‌ పోలీసులు 2004లో ఎన్‌కౌంటర్‌ చేసిన ఇస్రత్‌ జహాన్ అనే అమ్మాయి, లష్కర్‌ ఏ తయ్యబా తీవ్రవాద సంస్థకు చెందిన వ్యక్తి అని హెడ్లీ కుండబద్దలు కొట్టారు. దాంతో ఇన్నాళ్లూ ఇస్రత్‌ జహాన్‌ ఒక అమాయకురాలైన కాలేజి విద్యార్థిని అనీ, ఆమెను మతం పేరుతోనే అన్యాయంగా చంపారనీ చెబుతున్న కాంగ్రెస్‌కు పచ్చివెలక్కాయ పడినట్లైంది. హెడ్లీ చెబుతున్న దాని ప్రకారం ఇస్రత్‌ గుజరాత్‌లో మారణహోమం సృష్టించేందుకు నియమించబడిన ఒక తీవ్రవాది. అందుకోసం ఆత్మాహుతికి సైతం పాల్పడేందుకు ఆమె సిద్ధంగా ఉంది. మరో ముగ్గురు తీవ్రవాదులతో కలిసి ఇస్రత్‌ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ మీద ఆత్మాహుతి దాడి చేసేందుకు ప్రణాళికలు రచిస్తుండగా, గుజరాత్‌ పోలీసులు వారిని ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు.

ఇస్రత్ జహాన్ ఎన్‌కౌంటర్‌ను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ దశాబ్ద కాలంగా ప్రయత్నిస్తూనే ఉంది. 2004 తరువాత జరిగిన ప్రతి ఎన్నికలలోనూ కాంగ్రెస్‌ ఇస్రత్ ప్రస్తావనను తీసుకువచ్చేది. మోదీ మతోన్మాదంతో కావాలని ఒక అమాయకురాలని చంపించాడని ఆరోపించేది. అనేక న్యాయవిచారణలలో కూడా ఇస్రత్‌ని చంపేందుకు పోలీసులు అత్యుత్సాహం చూపారని తేలడంతో బీజేపీ తనను తాను సమర్థించుకునేందుకు ఇన్నాళ్లూ అవకాశం లేకపోయింది. కానీ ఇప్పడు సాక్షాత్తూ లష్కర్‌ ఏ తయ్యబా తీవ్రవాది అయిన హెడ్లీనే, ఇస్రత్‌ ఒక కరోడా తీవ్రవాది అని తేల్చేయడంతో కాంగ్రెస్‌ తన బాణీని మార్చింది. కాంగ్రెస్ నేత మనీష్ తివారీ మాట్లాడుతూ ‘ఇస్రత్‌ తీవ్రవాది అయితే అయి ఉండవచ్చు కానీ, ఆమెను ఎన్‌కౌంటరు చేయడం మాత్రం తగిన చర్య కాదు’ అని పేర్కొన్నారు. బీజేపీ నేతలు మాత్రం ఇన్నాళ్లూ ఒక తీవ్రవాది మరణాన్ని రాజకీయం చేసినందుకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాల్సిందే అంటున్నారు. ఇస్రత్‌ జహాన్‌ను ఇన్నాళ్లూ పొగిడిన నేతలు ఇప్పడు సంజాయిషీ ఇవ్వాల్సిందే అంటున్నారు. అయినా మన పిచ్చిగానీ నేతలు ఎప్పుడన్నా తప్పుని ఒప్పుకుంటారా?