కాంగ్రెస్ లో కన్ ఫ్యూజన్

 

ఏనుగు చచ్చినా బ్రతికినా దాని విలువ ఒక్కటే నన్నట్లు, కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన రాజశేఖర్ రెడ్డి చనిపోయి చాలా కాలం అయినప్పటికీ ఆయనని తలుచుకొని కాంగ్రేసోడు లేడు. కొందరు “ఆయనంత మంచోడు ఈ భూప్రపంచం మీదనే పుట్టలేదు, మరి పుట్టడు కూడా!” అని వాదిస్తుంటే, “నిజమే అటువంటి అవినీతిపరుడు పుట్టలేదు. ఇక ముందు కూడా పుట్టబోడు” అని వారినే సమర్దిస్తూ అడ్డుగా వాదిస్తుంటారు. మళ్ళీ చూస్తే అందరూ కాంగ్రెసోళ్ళే! ఇంతకీ ఆయనని వదిలించుకోవాలో లేక ఇంకా భుజానికెత్తుకొని తిరగాలో తెలియక పాపం! నేటికీ ఇంకా తికమకపడుతూ డిల్లీ వైపు చూస్తుంటారు ఆదేశాలకోసం. “ఆయన చాలా మంచివాడని” “వాళ్ళది మనదీ డీ.యన్.యే. సేంసేం” అని సాక్షాత్ దిగ్విజయ్ సింగ్ అంతటివాడు చెప్పినా కూడా ఈ కాంగ్రెస్సోళ్ళకు కనఫ్యుస్ పోలేదు.

 

పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్తిబాబు “ఆయన (రాజశేఖర్ రెడ్డి) పెద్దమందు బాబు గొంతు తడపుకోనిదే పాపం! ఆయనకి నిద్రపట్టదని” శలవిస్తుంటే, “ఓస్! అందులో తప్పేముంది? నేను కూడా ఓ పెగ్గు వేస్తుంటానని” గండ్ర నిలకడగా నిలబడి మరీ చెప్పారు. “అసలు బొత్స చెప్పింది ఆవగింజలో అరవయ్యో వంతే, వైయస్సార్ జాతక చక్రమంత ఔపోసన పట్టిన ఘనాపాటి మా బొత్స బాబు. ఆయన నోరు విప్పితే వైయస్ కుటుంబం మరిక చుట్టుపక్కల కనబడకుండా పారిపోకతప్పదు. అయినా రాజశేఖర్ రెడ్డి అదృష్టం బాగుంది గాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, మా అదృష్టం బాగోలేదు గాబట్టి మేము కాలేకపోయాము” అని హనుమంతన్న బరువుగా నిట్టూర్చారు.

 

ఇక ఉండవల్లి “పాపం పెద్దాయన చాలా అమాయకుడు. వెనుక నుండి కొడుకు నొక్కేస్తుంటే సరిగ్గా చూసుకోలేకపోయాడు. ఆయన మహా నిఖార్సయిన మనిషి, కానీ కొడుకే ప్చ్!” అని బాధపడ్డారు. “వాళ్లిద్దరూ కూడా ఒక గూటి చిలుకలే కదా! మరి అందుకే ఆయన అలా పలుకుతారు. రాజశేఖర్ రెడ్డి గురించి మమ్మల్ని అడగండి, ఆయన మా తెలంగాణా నీళ్ళని, గనులని, భూములని, ఎట్లా దోచుకోన్నాడో చెపుతాము” అని టీ-కాంగ్రెస్ నేతలు గర్జిస్తున్నారు. ఇంతకీ ఈ కాంగ్రెస్సోళ్ళకు ఈ  కన్ ఫ్యూజన్  ఎప్పుడుపోతుందో? అసలు పోతుందో లేదో కూడా తెలియదు.