సమావేశానికి నలుగురు కాంగ్రెస్ యం.యల్యే.లు డుమ్మా!

 

తెలంగాణాలో 6 యం.యల్సీ. స్థానాలకు 7మంది అభ్యర్ధులు పోటీలో ఉండటంతో బేరసారాలు అనివార్యమని తేలిపోయింది. పోలింగ్ కి ఇంకా ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున ప్రతిపక్ష పార్టీలు తమ యం.యల్యేలు జారిపోకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ తన ఏకైక అభ్యర్ధిని గెలిపించుకొనేందుకు అవసరమయిన 18మంది యం.యల్యేలున్నారు. కానీ వారిలో నలుగురు యం.యల్యేలు- పువ్వాడ అజయ్‌, గీతారెడ్డి, కిష్టారెడ్డి, వంశీచంద్‌రెడ్డిలు ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్షం సమావేశానికి డుమ్మా కొట్టారు. వారి నలుగురిలో పువ్వాడ అజయ్‌ ప్రస్తుతం అమెరికాలో ఉన్నందున రాలేదని తెలుస్తోంది. కానీ మిగిలిన ముగ్గురు యం.యల్యేలు కీలకమయిన ఈ సమావేశానికి ఎందుకు డుమ్మా కొట్టేరో అసలు కారణం తెలియదు గానీ వారు వ్యక్తిగత పనులున్నందున సమావేశానికి రాలేకపోయారని, కానీ పోలింగ్ రోజున తప్పకుండా హాజరయ్యి కాంగ్రెస్ యం.యల్సీ.అభ్యర్ధి ఆకుల లలితకు ఓటువేసి గెలిపిస్తారని కాంగ్రెస్ నేతలు చెప్పుకొన్నారు. వారిలో గీతారెడ్డి సమావేశానికి హాజరు కాకపోయినప్పటికీ ఆమెను అనుమానించాల్సిన పనిలేదు. కానీ మిగిలిన ఇద్దరు యం.యల్యేల సంగతే కొంచెం అనుమానంగా కనిపిస్తోంది. వారు నలుగురు వచ్చి తమ పార్టీ అభ్యర్ధికి ఓటు వేస్తే పరువాలేదు కానీ వారిలో ఏ ఒక్కరు తెరాస అభ్యర్ధికి ఓటు వేసినా కాంగ్రెస్ అభ్యర్ధి గెలిచే అవకాశం ఉండదు. క్రాస్ ఓటింగ్ జరుగకుండా నివారించేందుకు ఈ ఎన్నికలలో తొలి ప్రాధాన్యత ఓటును మాత్రమే వేయాలని ఈ సమావేశంలో కాంగ్రెస్ నిర్ణయించింది.