మళ్ళీ ముఖ్యమంత్రికి డిల్లీ పిలుపు దేనికి?

 

మంగళవారం లోక్ సభలో లోక్ పాల్ బిల్లు ఆమోదం పొందిన తరువాత పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అవిశ్వాసం తీర్మానం అని ఎగిరేగిరిపడిన కాంగ్రెస్ యంపీలు కూడా తట్ట బుట్టా సర్దుకొని మళ్ళీ రాష్ట్రానికి తిరిగివచ్చేస్తారు. అందువల్ల కాంగ్రెస్ అధిష్టానం మళ్ళీ రాష్ట్ర విభజన బిల్లుపై కసరత్తు మొదలుపెట్టేందుకు సిద్దం అవుతోంది.

 

ప్రస్తుతం రాష్ట్ర శాసనసభలో కానీ, శాసనమండలిలో గానీ తెలంగాణా బిల్లుపై చర్చ జరిగే వాతావరణం కనబడటం లేదు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీబిల్లుపై మాట్లాడి బుక్కయిపోకూడదనే ఉద్దేశ్యంతో ఉభయ సభలను నడవనీయకుండా అడ్డుపడుతూ, బహుశః రాష్ట్రపతి ఇచ్చిన జనవరి23 గడువు వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగించే అవకాశాలున్నాయి.

 

తెదేపా, వైకాపా మరియు సీమాంధ్ర కాంగ్రెస్ నేతల ఈ ఉద్దేశ్యాన్నికనిపెట్టిన తెరాస, టీ-కాంగ్రెస్ మరియు బీజేపీలు బిల్లుపై ఎటువంటి చర్చలేకుండానే రాష్ట్రపతికి త్రిప్పిపంపాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్ పై ఒత్తిడి తెస్తున్నాయి. ఇక ఇటీవల దిగ్విజయ్ సింగ్ తో బొత్స సత్యనారాయణ ఇంటిలో భోజన సమావేశం తరువాత పూర్తిగా చల్లబడిపోయిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా బిల్లుపై ఇదివరకులా రంకెలు వేయడం లేదు. అదేవిధంగా ఆయన సహచర మంత్రులయిన గంటా శ్రీనివాసరావు, శైలజానాథ్, టీజీ వెంకటేష్ తదితరులు కూడా ఇప్పుడు పూర్తిగా చల్లబడిపోయారు.

 

అందువల్ల పూర్తి అనుకూలంగా ఉన్న ఇటువంటి సమయంలో బిల్లును తిరిగి వెనక్కి రప్పించుకోగలిగితే, వెంటనే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టవచ్చుననే ఆలోచనతోనే కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని డిల్లీకి పిలిచి ఉండవచ్చును.

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ విధేయుడుగానే ఉంటారని, రాష్ట్ర విభజనకు పూర్తిగా సహకరిస్తారని గతంలో దిగ్విజయ్ సింగ్ చాలా సార్లు చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే కిరణ్ కుమార్ రెడ్డి కూడా వ్యవహరిస్తున్నారు గనుక, ఇక ఎన్నికల వరకు ఆయనను మార్చే అవసరం కూడా లేదు. కనుక, ప్రస్తుతం శాసనసభలో ఉన్న తెలంగాణా బిల్లుపై కనీసం తెలంగాణా సభ్యుల ఆమోద ముద్ర వేయించేసి, వీలయినంత త్వరగా రాష్ట్రపతికి త్రిప్పి పంపమని కాంగ్రెస్ అధిష్టానం ఆయనను ఆదేశించవచ్చును.