మేధోమధనమా మజాకా....

 

 

ఏమిటి సార్... మీ బుర్ర అంతగా వాచిపోయుంది? క్యాన్సర్ కణితి వంటిదేమయిన బుర్రలో ఏర్పడిందా? పైగా మీ బుర్రలోంచి ఆ పొగలేమిటీ...చూస్తే నాకు భయం కూడా వేస్తోంది...సార్?

 

అబ్బా ఊరుకోవయ్యా నీ జోకులు నువ్వూను. ఇప్పుడే మాపార్టీతో మేధోమధనం చేసుకొని వస్తున్నాను...అలిసిపోయానయ్యా ఇక వస్తా!

 

సార్...సార్... మీ వాచిపోయిన బుర్రని చూస్తే చాలా మదించేసినట్లు కనిపిస్తోంది. మీరేవిదంగా మేధోమధనం చేసారో నాలుగుముక్కలు నాచెవిన వేసిపోదురూ...నాకూ కాస్త జ్ఞానం అబ్బుతుంది.

 

అబ్బబా...మా పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి అలిసిపోయానయ్యా అని చెపుతున్నా నక్షత్రకుడిలాగ నా వెంటపడుతావేమిటయ్యా...నువ్వూ?

 

అరరే...లక్షలు ఖర్చుపెట్టి ఏర్పాటు చేసుకొన్న మీపార్టీ మీటింగులో, మీరే మీ పార్టీని తిట్టడం ఏమిటి సార్ విడ్డూరం కాకపోతేనూ? అయినా, అపోజిషన్ పార్టీ వాళ్ళు, మీ పార్టీలోఅలిగిన నాయకులూ తెల్లారిలేస్తే ఎలాగూ మీ పార్టీని తిడుతూనే ఉంటారు కదా? మళ్ళీ ఇప్పుడుకూడా మీ పార్టీని మీరే ఎందుకు తిట్టుకోవడం? నాకర్ధం కాలేదసలు...

 

అబ్బా...నీకెలా చెపితే అర్ధం అవుతుందయ్యా? నిన్నగాక మొన్నపార్టీలో జేరినవాడికి ఏకంగా కేంద్ర మంత్రిపదవి కట్టబెట్టేసి, మావంటివారిని ముసలిగుర్రాలని పక్కన పెట్టేస్తే మాకు కోపం రాదూ?

 

సార్! నాదో చిన్న సందేహం! అయితే మీ పార్టీ మధనానికి పిలిచింది మీ బాగోతాలు వినడానికేనా?మరి పేపర్లలో, టీవీల్లో అలా చెప్పారు...?

 

అబ్బాబా...ఏమిటయ్యా నీ యక్ష ప్రశ్నలూ...ధర్మ సందేహాలూ? మా గోడు చెప్పుకొందుకు మళ్ళీ మేము ప్రత్యేకంగా మరో మీటింగు పెట్టుకోవాలనా నీ ఉదేశ్యం? తెలంగాణావాడు వాడి గోడు వాడు వెల్లబోసుకొంటాడు. సమైక్యాంధ్రవాడి గోల సమైక్యాంధ్రవాడిది. పదవులు దొరకని మావంటి వారి గోడు మాది. బ్యానర్లమీద ఫోటోలువేయని వారి ఏడుపులు వాళ్ళవి. సంక్షేమ పదకాలన్నీ నా స్వంతంమే అని తన ఫొటోలతో ఒకరు పుస్తకాలు అచ్చేసుకొంటే, అందులో మా పాత్రా, ఫోటోలు లేనేలేవా అసలు? అని రుసరుసలాడే వాళ్ళు మరొకరు...ఏమి చెప్పమంటావు చెప్పు...మా మేధోమధనం గురించీ? మహాద్బుతంగా జరిగిందంటే నమ్ము.

 

అయితే, సార్...నాదో చిన్నడవుటు...మరి ఇంతకీ మీరందరూ కలిసి కష్టపడి ఏమి కనిపెట్టేరు మీ మేధోమధనంలో? పార్టీకి, ప్రభుత్వానికి మద్య ఎదో సయోధ్య వంటిది సాదిద్దామనే కదా మీరందరూ ఈ మీటింగు పెట్టుకోన్నారని మీడియా వాళ్ళు వ్రాసారు...?రాబోయే ఎన్నికలని ఎలా దీటుగా ఎదుర్కోవాలో నిర్నయించుకొందామనే మీరీ మీటింగు పెట్టుకొంటున్నట్లు మీడియా వాళ్ళు వ్రాసారు మరీ?

 

ఇదిగో...మీడియా పేరెత్తకు...నాకు ఒళ్ళు మండుతుంది. వాళ్ళు వ్రాసేవన్నీ పచ్చి అబద్దాలు..నీ వంటి వెర్రివాళ్ళే అటువంటి వార్తలన్నీ నమ్ముతారు. మేమేమి సాధించి పడేసేమో మాకూ మా పార్టీకి బాగా తెలుసు అదే విషయంపై మజ్జానం బోజనాలు అయిపోయాక అందరం సుదీర్గఉపన్యాసాలు చేసుకొని గుర్తుకుతెచ్చుకోన్నాము కూడా. మేము సాదించాల్సింది ఇంకేమి మిగల్లేదు...ఇక దేనిగురించి ఆలోచించాలి మేము? అయినా మా అప్పోజిషను వాళ్ళు మామీద ఎప్పుడూ నీలాపనిందలు వేయక మానట్లేదు...అందుకే ఆ మైకుతోనే వాళ్ళనీ ఒక దులుపు దులిపెసాము మామేధోమధనంలో.

 

సార్..మరి ఎన్నికలకి తయారి అవుతున్నట్లు తెలిసింది నిజమేనా?

 

ఆ..ఆ...ఎన్నికలా ఆ.. వస్తేరానీండి...మేము వాటికొరకే చాలా కాలంగా ఎదురుచూస్తున్నాము. మేము ఎన్నికలు ఎప్పుడూ వస్తూనే ఉండాలని కోరుకొంటాము... ఈసారి మాకు పార్టీ టికెట్స్ ఇవ్వకపోయినా మా పిల్లలకయినా ఇచ్చేట్లు మా రాహుల్ బాబు దూతలకి ఎలాగయినా నచ్చజెప్పుకోవాలి తప్పదు. మేము ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్దమే. మేము ‘అన్నీ’ సిద్దo చేసుకొనిఉంటే పార్టీ సిద్దంగా ఉన్నట్లే కదా? ఇంకా ఎన్నికల గురించి మీటింగులో ఏమాలోచించాలి..?పార్టీయే ఎవరెవరికి టికెట్స్ ఇవ్వాలో ఆలోచిoచుకోవాలి...అంతకన్నా ఆలోచించడానికీ, చేయడానికి ఏముంటుంది ఇప్పుడు?

 

సార్! మరయితే ఈ మేధోమధనం...?

 

అబ్బాబా రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుందని అడిగేడుట నీ వంటి వాడే. నీ కీ జన్మకి అర్ధం అయ్యేలా నేను చెప్పలేను...వెళ్ళు వెల్లెళ్ళు...నీ పిచ్చి ప్రశ్నలకి జవాబు చెప్పలేక నా బుర్ర మరింత వేడెక్కిపోయింది. మరో ముక్క చెప్పే ఓపిక కూడా నాకు లేదు.. వెల్లెళ్ళు...మళ్ళీ నాకు రేపు డిల్లీలో మరో మీటింగు ఉంది...ఇంత కంటే పెద్దది...

 

సార్...సార్....అలాగ పారిపోతే ఎలాగా సార్..అదికూడా మళ్ళీ ఇటువంటి మేధోమధనమేనా? 

.........    .....   .............