వలసలతో పార్టీలు సలసల

 

సాధారణ ఎన్నికలకు ముందొచ్చిన వలసలు పాలమూరులో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నాయకత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అధికారికంగా అభ్యర్థిత్వాలు ఖరారయ్యే వరకు ఈ కలకలం తప్పదని నేతలు ఆవేదన చెందుతున్నారు. పలు నియోజకవర్గాల్లోని కేడర్‌లో కూడా అయోమయ పరిస్థితి నెలకొంది. వలసల కారణంగా కాంగ్రెస్ పార్టీలో మూడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఇబ్బందులు ఎదురవుతుండగా....తెలంగాణ రాష్ట్ర సమితికి నాలుగు స్థానాల్లో తల నొప్పులు తప్పని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీలోకి అలంపూర్ మాజీ ఎమ్మేల్యే చల్లా వెంకట్రాంరెడ్డి చేరటంతోనే కొల్లాపూర్, అలంపూర్ నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు తీవ్ర రూపం దాల్చాయి. ఏకంగా అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం కాంగ్రెస్‌ను వదిలి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీనికి ప్రధాన కారణం చల్లా సూచించిన వ్యక్తికే అలంపూర్ టికేట్ ఇస్తారని ప్రచారం కావటమేనని తెలుస్తుంది. మరో పక్క చల్లా వెంకట్రాం రెడ్డి కొల్లాపూర్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తుండటంతో...ఇక్కడి నుంచి బరిలో నిలవాలని ప్రయత్నిస్తున్న విష్ణువర్థన్‌రెడ్డి, మరికొందరు తీవ్ర అసంతృప్తితో తాడోపేడో తేల్చుకోడానికి సిద్దపడుతున్నారట.

 

మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డికి ఖరారు అవుతోందని ప్రచారం జరుగుతుండటంతో ఈ స్థానంపై కన్నేసిన మాజీ ఎంపి, కాంగ్రెస్ నేత విఠల్‌రావు కొడంగల్ అసెంబ్లీ సీటు కావాలంటున్నారు. దీంతో ఇక్కడినుంచి టికెట్‌ను ఆశిస్తున్న పలువురు నేతలు అసమ్మతి రాగం ఆలపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి అటో ఇటో అంటున్నారని సమాచారం. టీఆర్‌ఎస్ లో లొల్లి మరోలా ఉంది. టీడీపీ ఎమ్మెల్యేలు వై. ఎల్లారెడ్డి (నారాయణపేట), జైపాల్‌ యాదవ్ (కల్వకుర్తి) టీఆర్‌ఎస్‌ లో చేరగా, గద్వాలలో మాజీ మంత్రి అరుణ బంధువు కృష్ణమోహన్‌రెడ్డి కూడా కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

 

టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ లో చేరారు. వీరందరికీ టికెట్లు ఇస్తామన్న కేసీఆర్, నియోజకవర్గాలు కూడా కేటాయించారు.ఎల్లారెడ్డికి మక్తల్, జైపాల్‌యాదవ్‌కు ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కల్వకుర్తి, శ్రీనివాస్‌గౌడ్‌కు మహబూబ్‌నగర్, కృష్టమోహన్‌రెడ్డికి గద్వాల అసెంబ్లీ స్థానాలను కేటాయించారు. దీంతో ఆ నాలుగు నియోజకవర్గాల్లో అసమ్మతి రాజుకుంది. పాలమూరు పార్టీ ఇన్‌చార్జి ఇబ్రహీం ఇక్కడ నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తానని స్వయంగా ప్రకటించటంతోపాటు ఇతరులతో టచ్‌లో ఉంటున్నట్టు ప్రచారం సాగుతోంది. అవకాశాన్ని బట్టి కాంగ్రెస్ లేదా ఎంఐఎం లో ఇబ్రహీం చేరవచ్చునన్న ప్రచారం జరుగుతోంది.

 

కల్వకుర్తిలో పార్టీ ఇన్‌చార్జి బాలాజీసింగ్, మక్తల్‌ లో ఆ పార్టీ నాయకుడు దేవర మల్లప్ప,గద్వాలలో పార్టీ ఇన్‌చార్జి గట్టు భీముడు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. కల్వకుర్తిలోబాలాజీసింగ్ అనుచరులు ఒకడగు ముందుకేసి అందోళనకు దిగారు. ఇలా రెండు పార్టీల్లోనూ వలసల సెగలు భగభగమంటూనే ఉన్నాయి.