కాంగ్రెస్-తెరాస పొత్తులెందుకొద్దు అంటే

Publish Date:Mar 8, 2014

Advertisement

 

టీ-కాంగ్రెస్ నేతలు తెరాసతో పొత్తులు వద్దనుకోవడానికి కారణం ముఖ్యమంత్రి, ఇతర కీలక పదవుల కోసం ఆరాటం వల్లనే తప్ప వేరేఏమీ కాదు. ఒకవేళ కాంగ్రెస్-తెరాసలు పొత్తులు పెట్టుకొంటే, టికెట్స్ మరియు మంత్రి పదవులలో సింహభాగం తెరాసకే వెళ్ళిపోవడం ఖాయమని వారికీ తెలుసు. ఎన్నోఏళ్లుగా ముఖ్యమంత్రి పదవి కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న జానారెడ్డి, గీతారెడ్డి, దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, జైపాల్ రెడ్డి వంటి ఓ డజనుమంది టీ-కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు ఆ అవకాశం వస్తుంటే, దానిని చేజేతులా కేసీఆర్ కి ఆయన కుటుంబ సభ్యులకి అప్పగిస్తారని భావించలేము. అందుకే వారు విలీనమే కాదు తెరాసతో పొత్తులు కూడా వద్దని కోరుకొంటున్నారు. అయితే ఒకవేళ కేసీఆర్ బీజేపీతో పొత్తులు పెట్టుకొంటే వారి పరిస్థితి ఏమిటో వారే ఊహించుకోవచ్చును. కానీ, తెరాస బీజేపీతో పొత్తులు పెట్టుకోకపోయినా కేసీఆర్ మరియు తెరాస ధాటికి టీ-కాంగ్రెస్ నేతలు నిలవలేరని వారికీ తెలుసు. అయితే పొత్తులు పెట్టుకొని పదవులు వదులుకోవడం కంటే, పోరాడిపోగొట్టుకొన్నా అంత బాధ అనిపించదు కనుకనే టీ-కాంగ్రెస్ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ తెరాసతో పొత్తులు వద్దని చెపుతున్నారు.

 

తెరాస కూడా ఇంచుమించు వారిలాగే ఆలోచిస్తోంది గనుకనే ఆ పార్టీతో విలీనం,పొత్తులు వద్దని కోరుకొంటోంది. గత పదేళ్ళుగా ఎండనక వాననక రోడ్లమీద పడి ఉద్యమాలు చేసి తెలంగాణా సాధించుకొన్నాక తీరాచేసి ఇప్పుడు అధికారం చేతికి అందే సమయంలో దానిలో కాంగ్రెస్ పార్టీకి వాటా పంచి ఇవ్వడం బాధగానే ఉంటుంది. గనుక టీ-కాంగ్రెస్ నేతల ప్రకటనను తెరాస కూడా స్వాగతించవచ్చును.

 

అయితే జానారెడ్డి చెప్పినట్లు ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ తిరిగి కేంద్రంలో అధికారం చెప్పట్టాలంటే యంపీ సీట్లు అవసరం గనుక, కాంగ్రెస్-తెరాసలు మెజార్టీ యంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీకి, మెజార్టీ యంయల్యే సీట్లు తెరాసకి దక్కేలా ఒప్పందం చేసుకొని ఎన్నికల పొత్తులకి సిద్దపడవచ్చును.ఆవిధంగా ఒప్పందం చేసుకోవడం వలన తెరాసకు కూడా లాభమే. ఎందుకంటే దానికి యంపీ సీట్లకి పోటీ చేసే సామర్ధ్యం, పెట్టుబడి పెట్టగల సరయిన నేతలు లేరు. పైగా దాని దృష్టి రాష్ట్రంలో అధికారంపైనీ కానీ, కేంద్రంపై లేదు.

 

అయితే, ఈ ఒప్పందం వలన మళ్ళీ జానారెడ్డి వంటి వారి ఆశలు ఆవిరి కాకమానవు. పోనీ ఎన్నికల తరువాత కేంద్రంలో మళ్ళీ తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏ కేంద్రమంత్రి పదవో పుచ్చుకొందామన్నా, ఈ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుస్తుందనే నమ్మకమే లేదు. అందువల్ల టీ-కాంగ్రెస్ నేతలందరూ తెరాసతో పొత్తు వద్దని తమ అధిష్టానంపై తీవ్ర ఒత్తిడిచేయవచ్చును. తెరాస కోరుకొంటున్నదీ అదే. కాగల కార్యం గందర్వులే చేస్తారు అంటే ఇదేనేమో!

By
en-us Political News