సీమాంధ్ర నేతల మధ్య చిచ్చుకి కాంగ్రెస్ కొత్త ఐడియా

 

లోక్ సభలో నిన్న జరిగిన గొడవ, ఏకంగా 18మంది సభ్యులను సస్పెండ్ చేయడం, తన సభ్యులను అదుపుచేయలేని కాంగ్రెస్ అధిష్టానం అసమర్ధతని ఎండగడుతూ బీజేపీతో సహా దేశంలో అన్ని ప్రతిపక్ష పార్టీల విమర్శలు, కాంగ్రెస్ (సభ్యులకి) వ్యతిరేఖంగా దేశవ్యాప్తంగా మీడియాలో విమర్శలు, కదనాలు కాంగ్రెస్ అధిష్టానాన్ని ఉక్కిరిబిక్కిరి చేసాయి. రాష్ట్ర విభజన చేసి రాజకీయ లబ్ది పొందుదామని దురాశకు పోతే ఉన్న పరువు కూడా ఈవిధంగా పోతుండటంతో, ఈ సమస్య నుండి ఎలాగయినా గట్టేకేందుకు కాంగ్రెస్ అధిష్టానం మరో కొత్త ఆయుధం బయటకు తీసింది. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని అంశం. మొన్న ప్రధానిని కలిసిన బీజేపీ అగ్ర నేతలు కూడా రాజధాని గురించే ప్రశ్నించడంతో, ఇప్పుడు అదే అంశంతో ఇప్పటికే గ్రూపులుగా, పార్టీల వారిగా విడిపోయున్న సీమాంధ్ర నేతల మధ్య చిచ్చుపెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్దపడుతోంది.

 

నిజానికి రాష్ట్ర విభజన ప్రకటన చేసినప్పుడే నిపుణుల కమిటీని వేసి 45రోజులలోగా కొత్త రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలి? దానికి ఎంత నిధులు కావాలి? తదితర అంశాలపై ఓ నిర్ణయం తీసుకొని బిల్లులో చేరుస్తానని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ, ఆ తరువాత హామీని పక్కన పడేసి కధ ఇంతవరకు నడిపించింది. బహుశః రాష్ట్ర విభజన చేయగలనని కాంగ్రెస్ అధిష్టానానికి కూడా పూర్తిగా నమ్మకం లేనందునే, ఈవిషయం పట్టించుకోలేదేమో? ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానానికి నిజంగా తెలంగాణా ఏర్పాటుపై చిత్తశుద్ధి ఉండి ఉంటే, రాష్ట్ర విభజనకు మానసికంగా సిద్దపడి సీమాంధ్ర కోసం ప్యాకేజీలు కోరిన పురందేశ్వరి, చిరంజీవి వంటి వారికి పూర్తి భరోసా కల్పించి, వారిని ప్రోత్సహించి, వారి ద్వారా కొత్త రాజధాని ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లి ఉండేది. కానీ, ఎంతసేపు రాష్ట్ర విభజన చేసి ఏవిధంగా రాజకీయ లబ్ది పొందుదామా? అనే కుత్సిత ఆలోచనలు తప్ప, వేరే ధ్యాస లేకపోవడంతో చివరి నిమిషం వరకు కూడా అంతా అయోమయమే, అనుమానాస్పదమే!

 

ఇక పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి, పరువు పోగొట్టుకొన్న తరువాతయినా కాంగ్రెస్ అధిష్టానానికి జ్ఞానోదయం కలగకపోగా, ఇప్పుడు రాజధాని అంశంతో సీమాంధ్ర నేతల మధ్య చిచ్చుపెట్టి ఎలాగయినా బిల్లుని ఆమోదింపజేసుకోవాలని యోచించడం చూస్తుంటే కాంగ్రెస్ కి పోయే కాలం దాపురించినట్లే కనబడుతోంది.