వైసీపీలో ఏ2 పదవి కోసం తీవ్ర పోటీ- టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ట్వీట్

 

వైసీపీలో ఏ1, ఏ2లపై టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ఇవాళ ట్విట్టర్ లో చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. వైసీపీలో నేతల మధ్య ఆధిపత్య పోరుకు అద్దం పట్టేలా కేఈ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. వైసీపీలో ఏ2 పదవి కోసం ఏ1 అయిన జగన్ పార్టీ నేతల మధ్య పోటీ పెట్టారని, విపక్ష నేత చంద్రబాబును వీలైనంత ఎక్కువగా విమర్శించే వారికి ఏ2 పోస్టు దక్కుతుందని కేఈ తన ట్వీట్ లో పేర్కొన్నారు. అంతే కాదు ఏ2 పదవి కోసం పార్టీలో కీలక నేతలైన విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరితో ఒకరు పోటీ పడి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని కేఈ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

అంతటితో ఆగకుండా తన ట్వట్ చివర్లో కేఈ మరో ట్విస్ట్ కూడా ఇచ్చారు. అసలు రహస్యం ఏంటంటే జగన్ గారు, సాయిరెడ్డి గారు జీవిత కాలం జైలుకు వెళ్లడం తప్పదని డిసైడ్ అయిన సజ్జల రెడ్డి గారు పార్టీలో ఏ1 పదవికి బాణం ఎక్కుపెట్టారని కూడా పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే సజ్జల ఏకంగా ఏ2 కంటే ఏ1 పదవిపైనే దృష్టిపెట్టారని కేఈ చెబుతున్నట్లుగా ఈ ట్వీట్ ఉంది. వాస్తవానికి గతంలో జగన్, విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ఏ1, ఏ2 అంటూ టీడీపీ నేతలు విమర్శలు చేసేవారు. కానీ తాజాగా టోన్ మార్చి ఏ1 జగన్ ఏ2 పదవి కోసం పోటీ పెట్టారని ఓసారి, ఏ1 పదవి కోసం సజ్జల పోటీపడుతున్నారని మరోసారి పేర్కొనడం చూస్తుంటే వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరును బయటపెట్టారనే ఆలోచనతోనే కేఈ ఈ ట్వీట్ చేసినట్లు అర్దమవుతోంది.