వీరు త్యాగమూర్తులేనా?

 

శాసనసభ తిరస్కరించిన తెలంగాణా బిల్లుని యధాతధంగా పార్లమెంటులో ప్రవేశపెడితే రాజకీయ సన్యాసం చేస్తానని భీకర ప్రతిజ్ఞ చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా ‘లాస్ట్ బాల్స్’ మిగిలే ఉన్నాయని చెప్పడంతో ఆయన మరికొంత కాలం పదవిలో కొనసాగుతారని స్పష్టమయింది. కానీ మహాయితే మరో రెండు మూడు రోజులు మాత్రమే కొనసాగుతారని ఆయన సన్నిహితుడు మరియు క్యాబినేట్ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ రోజు మీడియాకు తెలిపారు. ఆయన కొత్త పార్టీ పెడతారా లేక రాజకీయ సన్యాసం తీసుకొంటారా లేకపోతే మంత్రి కొండ్రు మురళి చెప్పినట్లుగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా? అనే విషయంపై రేపు సీమాంధ్ర నేతలతో జరుగబోయే సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవచ్చును.

 

ఆయన మిగిలిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చాలా గట్టిగా ప్రయత్నించి విఫలమయినట్లు ప్రజలందరికీ నమ్మకం కలిగించాగాలిగారు. కానీ, విభజన జరుగుతోందని చాలా ముందే వీరందరికీ తెలిసి ఉన్నపటికీ ఎవరూ ఆపే ప్రయత్నం చేయకుండా, అందరూ సమైక్యంగా విభజన బిల్లుని జాగ్రత్తగా పార్లమెంటుకు చేర్చి ఇప్పుడు సమైక్యహీరోలుగా, తమ పదవీ కాలం పూర్తయ్యేవరకు కూడా పదవులలో కొనసాగి, ఇప్పుడు ఎన్నికల ముందు పదవులను, పార్టీని కూడా వదులుకొన్న త్యాగమూర్తులుగా ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడగబోతున్నారు.

మరి వీరందరూ త్యాగ మూర్తులే అయితే మళ్ళీ ఎన్నికలలో పోటీ చేయడం ఎందుకు? ప్రజలని ఓట్లు కోసం అర్ధించడం ఎందుకు? అని ఆలోచిస్తే వీరి త్యాగాలు దేనికో అర్ధమవుతాయి. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేవరకు ఓపికగా వేచిచూచిన తరువాత, కొత్తపార్టీలు పెట్టుకోనో లేకపోతే వేరే పార్టీ కండువా కప్పుకోనో ప్రజల ముందుకు వచ్చి రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీని తిడుతూ ప్రజలలో ఉన్న కాంగ్రెస్ వ్యతిరేఖతను, రాష్ట్రం విడిపోయిందనే వారి ఆవేదనను తమకు అనుకూలంగా మార్చుకొని మళ్ళీ అధికారంలోకి రావడానికే ఈ తిప్పలన్నీ. పోనీ వీరిని నమ్మి ఓటేస్తే మళ్ళీ వీళ్ళు అదే కాంగ్రెస్ పార్టీలో చేరరని నమ్మకమేమిటి? ప్రజలే ఆలోచించుకొని ఓటేయాలి.