ఆర్టీసీలో 50+30+20 ఫార్ములా... సంచలన నిర్ణయం దిశగా కేసీఆర్ అడుగులు

 

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఆగ్రహంతో రగిలిపోతోన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తున్నారు. వెయ్యి శాతం ఇప్పుడున్న ఆర్టీసీ ఉండబోదని ఇంతకుముందే చెప్పిన కేసీఆర్... ప్రైవేట్ భాగస్వామ్యం పెంచేందుకు రెడీ అవుతున్నారు. ఆర్టీసీని మూడు ముక్కలు చేయడంతోపాటు 50+30+20 ఫార్ములాను ముందుకు తెచ్చిన కేసీఆర్... దాన్ని అమలు చేసేందుకు కేబినెట్ ఆమోదం తీసుకోనున్నారు. అందుకే ఆర్టీసీపై చర్చించేందుకు ప్రత్యేకంగా మంత్రివర్గ సమావేశం నిర్వహించబోతున్నారు. 
 
నవంబర్ ఒకటిన సమావేశంకాబోతున్న మంత్రివర్గం... ఆర్టీసీపై అత్యంత కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రత్యామ్నాయ చర్యలను మరింత వేగవంతం చేయనున్నారు. అందుకు అనుగుణంగా కేబినెట్‌ మీటింగ్‌లో నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది. అద్దె బస్సులను 30శాతానికి పెంచడం... అలాగే 20 శాతం రూట్లను పూర్తిగా ప్రైవేటుకు అప్పగించడంలాంటి నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది.

ఆర్టీసీ కార్మికులు దిగిరాకపోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అంతే పట్టుదలతో ఉన్నారు. ఆర్టీసీ స్వరూపాన్నే సమూలంగా మార్చేయాలని యోచిస్తున్న కేసీఆర్‌.... సంస్థను మూడు ముక్కలు చేయడంతోపాటు పలు కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నారు. ఆర్టీసీలో ప్రైవేట్ భాగస్వామ్యం పెంచడంతోపాటు కొన్ని రూట్లను ప్రైవేటుకుపరం చేయనున్నారు.