అప్పుడు ఎన్టీఆర్... ఇప్పుడు కేసీఆర్... తమిళిసై రాకతో 1985 సీన్ రిపీట్ కానుందా?

2023లో అధికారమే లక్ష్యంగా తెలంగాణలో పావులు కదుపుతోన్న బీజేపీ... అన్నివైపుల నుంచి అస్త్రాలను ప్రయోగిస్తోంది. రాజకీయంగా బలపడటమే కాకుండా... వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఘనవిజయం సాధించి... తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది. అందుకు అస్త్రంగానే తమిళిసైని ప్రయోగించారనే ప్రచారం జరుగుతోంది. ఎన్ని ట్యాగులు తగిలించుకున్నా, బీజేపీకి హిందుత్వవాదమే బలం. అందుకే కరుడుగట్టిన హిందుత్వవాదిగా పేరున్న తమిళిసైని వ్యూహాత్మకంగా రంగంలోకి దింపారనే మాట వినిపిస్తోంది.

హిందుత్వ కార్యకలాపాల్లో చురుగ్గా పనిచేసిన తమిళిసైది దూకుడుగా వ్యవహరించే నైజం. తమిళనాట అసలు బీజేపీ ఉనికే లేనప్పుడు తమిళిసై అత్యంత సమర్ధవంతంగా పనిచేశారని అంటారు. అందుకే, తమిళిసైకి తమిళనాడు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారని, ఇప్పుడు తెలంగాణ గవర్నర్‌గా నియమించడం వెనుకా పక్కా వ్యూహం ఉందంటున్నారు. హిందుత్వవాదులను ప్రోత్సహించి బలపడాలన్నదే బీజేపీ గేమ్ ప్లాన్ కావడంతో... తమిళిసై రాకతో తెలంగాణలో హిందుత్వవాదులకు ఊహించనిస్థాయిలో అండ లభించబోతుందనే మాట వినిపిస్తోంది.

కరుడుగట్టిన హిందుత్వవాదిగా పేరున్న తమిళిసై రాకతో కేసీఆర్‌కు చిక్కులు తప్పవనే మాట వినిపిస్తోంది. అసలు కేసీఆర్‌ అండ్ టీఆర్‌ఎస్‌ టార్గెట్‌గానే తమిళిసైని గవర్నర్‌గా నియమించారనే ప్రచారం జరుగుతుండటంతో... 1985 నాటి పరిస్థితులు పునరావృతం కానున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఆనాడు ఎన్టీఆర్‌‌కి ఎదురైన పరిస్థితులే... ఇప్పుడు కేసీఆర్‌కి రిపీట్ కాబోతున్నాయేమోనని అంటున్నారు. 1985 నుంచి 1990 వరకు ఏపీ గవర్నర్‌గా పనిచేసిన కుముద్ బెన్ జోషి... ఆనాటి సీఎం ఎన్టీఆర్‌కి చుక్కలు చూపించారు. అప్పటి కాంగ్రెస్ ప్రధాని రాజీవ్ ఆశీస్సులతో రంగంలోకి దిగిన కుముద్ బెన్ జోషి... రాష్ట్రమంతా పర్యటించి లోపాయికారీగా కాంగ్రెస్‌ బలోపేతానికి ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే గవర్నర్ కుముద్ బెన్ జోషి చర్యలను ఎన్టీఆర్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాదు కుముద్ బెన్ జోషికి సహకరించొద్దంటూ అధికార యంత్రాంగానికి ఎన్టీఆర్ ఆదేశాలు సైతం ఇచ్చారు. అయితే, కేంద్రం అండతో రాజ్ భవన్‌ నుంచి కుముద్ బెన్ జోషి... ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నడిపారని అంటారు. వైస్ ఛాన్సలర్లతో చర్చలు జరపడం... నిత్యం కాంగ్రెస్ లీడర్లతో సమావేశమవడం కావడంతో... రాజ్‌భవన్‌ కాంగ్రెస్ కార్యాలయంగా మారిందనే విమర్శలు వచ్చాయి. అయితే, ఇప్పుడు తమిళిసై కూడా అదే తరహాలో వ్యవహరించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బీజేపీ నేతలకు అందుబాటులో ఉంటూ, హిందుత్వవాదులను, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించే అవకాశముందంటున్నారు.

మొత్తానికి తెలంగాణపై పకడ్బందీ ప్లాన్‌తోనే బీజేపీ నాయకత్వం తమిళిసైని తెరపైకి తెచ్చిందనే ప్రచారం జరుగుతోంది. 2023లో టీఆర్‌ఎస్‌ను ఓడించడం, అలాగే గద్దెనెక్కడమే లక్ష్యంగా గవర్నర్‌ నియామకం జరిగిందంటున్నారు. దాంతో కొత్త గవర్నర్ తమిళిసైతో కేసీఆర్‌కు తిప్పలు తప్పవనే మాటలు వినిపిస్తున్నాయి. మరి ప్రచారం జరుగుతున్నట్లుగా, కేసీఆర్ ప్రభుత్వానికి తమిళిసై కొరకరాని కొయ్యగా మారుతారో లేక నర్సింహన్ తరహాలోనే సహకరిస్తారో చూడాలి.