లగడపాటికి చంద్రబాబు ఆప్ష‌న్లు...!

 

గత కొద్ది కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న లగడపాటి రాజగోపాల్ మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. 2004, 2009 ఎన్నిక‌ల్లో రెండుసార్లు ఎంపీగా గెలిచిన లగడపాటి పదేళ్లపాటు విజయవాడను ఏలారు. ఆ తరువాత రాష్ట్రవిభజన అనంతరం... రాజకీయాలకు దూరమైపోయారు. ఐదేళ్ల పాటు రాజ‌కీయంగా సైలెంట్‌గా ఉన్న ఆయ‌న‌కు తిరిగి రాజ‌కీయాల్లోకి రావాల‌న్న కోరిక బ‌లంగా ఉన్నట్టు ఉంది. అందుకే మళ్లీ రాజకీయాల్లోకి రావాలని అందులో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీలోకి రావాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.

 

అంతేకాదు లగడపాటి సర్వేలు చేయడంలో కూడా దిట్ట అని చెప్పొచ్చు. లగడపాటి చేసిన సర్వేలు కూడా దాదాపు చాలావరకూ కరెక్ట్ గానే నిలిచాయి. అందుకే ఇటీవల ఓ జాతీయ ఛానల్ చేసిన సర్వేపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం లగడపాటి సలహా తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుందో సులువుగానే త‌న స‌ర్వేల‌తో అంచ‌నా వేసుకునే ల‌గ‌డ‌పాటికి ఏపీలో వ‌చ్చే ప‌దేళ్ల‌లోనూ టీడీపీయే ఫామ్‌లో ఉంటుంద‌ని తేల‌డంతో ల‌గ‌డ‌పాటి చూపుల‌న్నీ టీడీపీ మీదే ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..  ఇటీవ‌ల ఏపీ సీఎం చంద్ర‌బాబును ప‌దే ప‌దే క‌లుస్తోన్న ల‌గ‌డ‌పాటి ఏపీలో పార్టీ ప‌రిస్థితి మీద చేయించిన స‌ర్వే ఫ‌లితాల‌ను కూడా చంద్ర‌బాబుకు ఇస్తున్న‌ట్టు స‌మాచారం.

 

ఈ నేపథ్యంలోనే చంద్రబాబు లగడపాటికి ఓ ఆఫర్ కూడా ఇచ్చారట. అదేంటంటే... మీకు స్టేట్ పాలిటిక్స్‌లో చోటు క‌ష్టం… ఏపీలో ఏదో ఒక ఎంపీ సీటును ఇచ్చేందుకు ట్రై చేస్తాను… ఎంపీగా పోటీ చేస్తారా ? అని లగడపాటికి చంద్రబాబు ఆప్ష‌న్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. అంతేకాదు.. విజ‌య‌వాడ ఎంపీ సీటు కుద‌ర‌ని ప‌క్షంలో ల‌గ‌డ‌పాటికి వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత చంద్ర‌బాబు నుంచి రాజ్య‌స‌భ సీటు కూడా ఆఫ‌ర్ వెళ్లింద‌ట‌. మొత్తానికి లగడపాటికి ఎంట్రీఏ కాదు.. మంచి ఆఫర్ కూడా వస్తున్నట్టే కనిపిస్తోంది. మరి లగడపాటి ఏం నిర్ణయం తీసుకుంటారో చూద్దాం...