బబుల్గమ్ మింగితే ఏమవుతుంది?

 

బబుల్గమ్ని మింగితే అది కడుపులోనే ఉండిపోతుందన్నది చాలామంది నమ్మకం. పాశ్చాత్య దేశాలలో కూడా బబుల్గమ్ ఏడేళ్ల పాటు పొట్టలోనే ఉండిపోతుందని అనుకుంటారు. ఇది ఏమాత్రం వాస్తవం కాదంటున్నారు నిపుణులు. అలాగని అది అంత సురక్షితమూ కాదంటున్నారు.

 

జీర్ణం కాని పదార్థాలు:

బబుల్గమ్ని ఎంత నమిలినా కూడా అది కరగకపోవడానికి ముఖ్య కారణం అందులో ఉండే రెసిన్ అనే పదార్థం. మన పళ్లు ఈ రెసిన్ని నమిలినప్పుడు దాంతోపాటుగా ఉన్న చక్కెర వంటి పదార్థాలన్నీ కరిగిపోతాయే కానీ రెసిన్ మాత్రం అలాగే ఉండిపోతుంది. దాన్ని కనుక పొరపాటున నమిలేస్తే జీర్ణం చేసుకోవడం మన పేగుల తరం కాదు. అలాగని రెసిన్ మన శరీరంలో ఉండిపోతుందనుకుంటే పొరపాటే! మన శరీరంలో జీర్ణం కాని పదార్థాన్ని దేన్నైనా సరే, మన పేగులు నిదానంగా తోసుకుంటూ వెలుపలకి పంపేస్తాయి. అలా ఒక రోజులోనే మన కడుపులోకి చేరిన రెసిన్ మలం ద్వారా బయటకు వచ్చేస్తుంది.

 

ప్రమాదం లేకపోలేదు:

బబుల్గమ్ చాలా సందర్భాలలో బయటకి వచ్చేసే మాట నిజమే అయినా, కొన్ని అరుదైన సందర్భాలలో అది పేగులలో ఇరుక్కుపోవచ్చు. చీటికీమాటికీ బబుల్గమ్లను మింగేయడం, జీర్ణం కాని ఇతర నాణేలతో పాటుగా ఇది పొట్టలో పేరుకుపోవడం వంటి కారణాలతో ఇది పేగులలోనే ఉండిపోవచ్చు. అది ఒకోసారి కడుపులో నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలకు దారితీస్తుంది. అలాంటి సమయాలలో ఎండోస్కోపీ వంటి చిన్నపాటి ఆపరేషన్తో దీనిని తొలగిచాల్సి ఉంటుంది.

 

తస్మాత్ జాగ్రత్త:

బబుల్గమ్ మింగడం సంగతి అటుంచితే చీటికీమాటికీ దాన్ని నమిలేయడం ఏమంత క్షేమం కాదన్న వాదనలూ ఉన్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ అలవాటు శృతిమించితే సమస్యలు తప్పవట. బబుల్గమ్లో ఉండే చక్కెర పదార్థాల వల్ల పళ్లు పుచ్చిపోవడం, అందులోని సార్బిటాల్ వల్ల విరేచనాలు, ఘాటు పదార్థాల వల్ల నోటిలో చర్మం దెబ్బతినడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయట. పైగా చిన్నపిల్లలు బబుల్గమ్ని తినేటప్పుడు నోరు కూడా తెరుస్తూ ఉంటారు. దీనివల్ల నోట్లోకి గాలి వెళ్లిపోయి అజీర్ణం కలుగుతుంది.

- నిర్జర.