ట్రావెలర్స్ డయేరియా గురించి విన్నారా!

కుటుంబసమేతంగా హాయిగా గడిపేందుకు ఏదో పుణ్యక్షేత్రానికని బయల్దేరతాం లేదా పండుగ రోజుల్లో ఓ నాలుగు ఊళ్లు తిరిగిరావాలని గడపదాటతాం. ఊరు దాటాక ఏదో ఒకటి తినక మానదు. జిహ్వచాపల్యం అణచుకోలేకో, ఆకలికి తట్టుకోలేకో ఎక్కడో అక్కడ కాస్త ఆహారం తీసుకుంటాం. అంతే! మన విహారయాత్రలో నిప్పులు పోస్తూ అజీర్ణం మొదలవుతుంది. కడుపులో నొప్పి, గ్యాస్, విరేచనాలతో మన సంబరం కాస్తా సద్దుమణిగిపోతుంది. ఇలాంటి పరిస్థితికి ఓ పేరు ఉంది... అదే ట్రావెలర్స్ డయేరియా!


అపరిశుభ్రతే అసలు కారణం


నలుగురూ తిరిగే చోట పరిస్థితులు ఏమంత పరిశుభ్రంగా ఉండవు. హోటల్లో వంట చేసేవారి దగ్గర్నుంచీ వడ్డించేవారి వరకూ ఎవరో ఒకరు అపరిశుభ్రమైన చేతులతో ఆహార పదార్థాలను ముట్టుకోవచ్చు. ఇలాంటి సమయంలో వారి చేతికి అంటుకుని ఉన్న E.coli వంటి సూక్ష్మక్రిముల ద్వారా ట్రావెలర్స్ డయేరియా (TD) సోకే ప్రమాదం ఉంది.


ఇవీ లక్షణాలు


అకస్మాత్తుగా విరేచనాలు మొదలవ్వడం, జ్వరం, వాంతులు వికారం, ఆకలి వేయకపోవడం, కడుపులో పోట్లు, పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ లక్షణాల నుంచి ఉపశమనం లభించేందుకు మందులు ఎలాగూ అందుబాటులో ఉంటాయి. వాటితో పాటుగా పుష్కలంగా నీరు తాగుతూ ఉండాలి. నీళ్ల విరేచనాలు అవుతుంటే ORS పొడి నీళ్లలో కలుపుకుని తాగాలి. ఒకవేళ విరేచనాలలో రక్తం పోతున్నా, జ్వరం ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించడమే మంచిది. పసిపిల్లలు, గర్భవతులలో TD లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా అందుబాటులోని వైద్యుడిని సంప్రదించాల్సిందే!


ఇవీ జాగ్రత్తలు


TD వ్యాధి సాధారణంగా 3 నుంచి 7 రోజులల లోపు తగ్గిపోతుంది. చాలా అరుదైన సందర్భాలలో తప్ప ఇది ప్రాణాంతకం కాదు. కాబట్టి అట్టే కంగారుపడాల్సిన పని లేదు. అయితే బయట తిరిగే నాలుగు రోజులూ రోగంతో గడిచిపోతే అంతకు మించిన విషాదం ఏముంటుంది. TD సోకిన తరువాత కంగారుపడి మందులు వాడుతూ తిప్పలు పడేకంటే అసలు అది రాకుండా చూసుకోవడం మేలు కదా! అందుకోసం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి...


- అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలలో ఆహారం తీసుకోకూడదు. దారి పొడుగూతా అలాంటి హోటళ్లే కనిపిస్తుంటే ఓ నాలుగు పళ్లు తిని ఆకలి చల్లార్చుకోవడం మంచిది.


- పచ్చి కూరలు, ఉడకని పదార్థాలు ముట్టుకోకపోవడమే మేలు.


- అపరిశుభ్రమైన నీటితో తయారయ్యే ఐస్తో చేసే జ్యూస్ల జోలికి పోకూడదు.


- బయట తాగే నీటి విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. మినరల్ వాటర్ కానీ, కాచి చల్లార్చిన నీరు కానీ తాగాలి. అలా కుదరకపోతే క్లోరిన్ లేదా అయోడిన్ బిళ్లలు కలుపుకొని తాగాలి.


- నీరు అస్సలు బాగోలేదు అని అనుమానం ఉన్న చోట, ఆ నీటిని పుక్కిలించినా కూడా ప్రమాదమే!


- ప్రయాణాలలో ఎక్కడపడితే అక్కడ మాంసాహారం ముట్టకూడదు. ఎందుకంటే మాంసంలో ఏమాత్రం అపరిశుభ్రత ఉన్నా, అది ఒకోసారి ప్రాణాంతకంగా మారవచ్చు. ముఖ్యంగా చేపల జోలికి అసలు పోవద్దని హెచ్చరిస్తూ ఉంటారు.


ఇన్ని కబుర్లు చెబుతున్నారు. మరి నిత్యం అక్కడే ఉండిపోయే వారి పరిస్థితి ఏమిటి అన్న అనుమానం వచ్చిందా! నిజమే! అపరిశుభ్రమైన ప్రదేశాలలో నిరంతరం నివసించేవారికి కూడా మొదట్లో TD సోకి తీరుతుంది. కాకపోతే ఓ ఏడెనిమిదేళ్ల తరువాత వారి శరీరం ఆ సూక్ష్మక్రిములని తట్టుకునేందుకు అలవాటుపడిపోతుంది. కానీ మనకి అంత సమయం ఉండదు కదా! అందుకనే బయట తిరిగే నాలుగు రోజులు కాస్త జాగ్రత్తగా మెలగాల్సిందే!

- నిర్జర.