UK లో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థులను వెనక్కు తీసుకురండి!

తెలంగాణా విద్యార్థుల్ని వెన‌క్కి తీసుకురావాలంటూ చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ జి. రంజిత్ రెడ్డి కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ కు లేఖ రాశారు. Covid-19 కారణంగా UK లో పరిస్థితి అధ్వాన్నంగా మారింది. దాదాపు 4,500 మరణాలు మరియు 42,000 కంటే ఎక్కువ కేసులతో అక్కడ ఉన్న మన విద్యార్థులు మాత్రమే కాకుండా UK లోని భారతీయులు చాలా ఆందోళన చెందుతున్నారు. నిన్నటి నుండి యుకె రవాణాను కూడా నిలిపివేసింది. విదేశీయులను తమను తామే రక్షించుకోవాలని uk ప్రభుత్వం కోరింది. ప్ర‌స్తుత పరిస్థితుల్లో వారికి సహాయం చేయడం చాలా కష్టమని అక్కడ ఉన్న వారు భావిస్తున్నారు. UK లోని భారతీయులంతా ఆందోళ‌న‌కు గురి అవుతున్నారు. వారితో పాటు ఇక్క‌డున్న వారి కుటుంబసభ్యులు మరింత ఆందోళనకు గురి అవుతున్నారు. ఇండియాలో వున్న వారు త‌మ పిల్లలను, బంధువులను UK నుండి రక్షించాలని సందేశాలను పంపుతున్నారని ఎం.పి.రంజిత్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు.

భారతదేశంలో చిక్కుకున్న యుకె పౌరులను తిరిగి పంపించడానికి ఎయిర్ ఇండియా ఆరు విమానాలను - ఢిల్లీ నుండి 4 మరియు ముంబై నుండి 2 నడుపుతుంది. కాబట్టి యుకె నుండి తిరిగి వచ్చేటప్పుడు, అదే విమానాలు యుకెలోని వివిధ ప్రాంతాలలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను తీసుకురావాల‌ని ఎం.పి. సూచించారు. వారు ఇక్కడ దిగిన తర్వాత వారిని నిర్దేశిత కాలంపాటు క్వారెంటిన్ లో ఉంచిన తరువాత మాత్రమే ఇంటికి వెళ్ళడానికి అనుమతించవచ్చని ఎం.పి. త‌న లేఖ‌లో పేర్కొన్నారు.

వివిధ విశ్వవిద్యాలయాల నుండి సుమారు 380 మంది భారతీయ విద్యార్థులు UK లోని ఇండియన్ హైకమిషనర్ కు భారతదేశానికి తిరిగి వెళ్ళడానికి సహాయం చేయమని అభ్యర్థించారు. విద్యార్థులు మరియు ఇతరుల వివరాలన్నీ హైకమిషన్ వద్ద ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం నుండి 50 మంది విద్యార్థులు ఉన్నారని మరియు వారిని రక్షించాలని మంత్రిని కోరారు.