అమిత్ షా మీద ఛార్జ్‌షీట్... తిరస్కరణ...

 

భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మీద ఉత్తర ప్రదేశ్ పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే కోర్టు ఆ చార్జ్ షీట్‌ను తిప్పిపంపింది. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై ఆరోపణ. తన ప్రసంగం ద్వారా అమిత్ షా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంటూ స్థానిక అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. కుల మతాల పేరుతో ప్రజలను ఓట్లు అడిగినందుకు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 123(3) సెక్షన్‌తో పాటు, ప్రభుత్వాధికారి జారీచేసిన ఆదేశాలను పాటించనందుకు ఐపిసిలోని 188 సెక్షన్ కింద అమిత్ షాపై కేసును నమోదయింది. అయితే అసలు ఆ ఛార్జిషీటులో అరెస్టు చేయడానికి సరైన కారణాలు చూపకపోవడమే కాకుండా, అరెస్టు వారెంటును కూడా పోలీసులు కోరలేదని కోర్టు తెలిపింది. ఆ ఛార్జిషీటులో పోలీసులు బలమైన కారణాలు చూపకపోవడంతో కొట్టివేస్తున్నట్లు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ స్పష్టం చేశారు.