బాబు గారి థర్డ్ ఫ్రంట్ జపం

 

 

chandrababu Third Front, TDP Third Front, Third Front 2014 elections

 

 

రాబోయే రోజుల్లో మళ్లీ థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, ఎన్నికలకు ముందో తరువాతో థర్డ్ ఫ్రంట్ ఏర్పడుతుందని, సుస్థిర, సమర్థ పాలన అందిస్తుందని, ఇందుకోసం తెదేపా కీలక పాత్ర పోషిస్తుందని చంద్రబాబు నాయుడు మహానాడులో వ్యాఖ్యానించారు.

 

13 పార్టీల కూటమితో యునైటెడ్ ఫ్రంట్ 1996లో ఆవిర్భవించింది. ఈ ఫ్రంట్ కి కన్వీనర్ చంద్రబాబు నాయుడు. 1996 నుండి 1998 వరకు ఈ ఫ్రంట్ ఆధ్వర్యంలో రెండు ప్రభుత్వాలు నడిచాయి. దేవె గౌడ ప్రధానిగా ఒక  ప్రభుత్వం, ఐ. కే. గుజ్రాల్ ప్రధానిగా మరొకటి. ఈ థర్డ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నడిచిన నాటి కేంద్ర ప్రభుత్వాలు రెండు పెద్దగా సాధించిన విజయాలేవి లేవు. ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు. దేవె గౌడ ప్రధానిగా కర్ణాటక రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్ళారు. ఒక రకంగా చెప్పాలంటే, ఆయన వ్యవహరించిన తీరు దేశానికి ప్రధానిగా కాక కర్ణాటకకి ప్రధాని అన్నట్లు ఉండేది.

      

ఈ థర్డ్ ఫ్రంట్ ఓటమి పాలైన తరువాత 1999 నుండి 2004 వరకు పరిపాలించిన వాజ్ పేయ్ నేతృత్వం లోని ఎన్ డి ఎ ప్రభుత్వాన్ని 5 సం. రాలు చంద్రబాబు ఎందుకు సమర్ధించారు?థర్డ్ ఫ్రంట్ కి కన్వీనర్ గా ఉండి చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేశాడు? థర్డ్ ఫ్రంట్ లో కాని, ఎన్ డి ఎ లో కాని కింగ్ మేకర్ పాత్ర పోషించిన తెదేపా మరోసారి థర్డ్ ఫ్రంట్ తో కింగ్ మేకర్ పాత్ర పోషించాలని కలలు కంటోంది. అప్పుడు కింగ్ మేకర్ గా రెండు సార్లు వెలుగు వెలిగిన చంద్రబాబు రాష్ట్రానికి సాధించి పెట్టింది ఏమిటి? బాలయోగికి స్పీకర్ పదవి, కొన్ని చిన్న చిన్న మంత్రి పదవులు మినహా.  

        

2004 లో ఎన్ డి ఎ ని సపోర్ట్ చేస్తూ ఎన్నికల బరిలోకి దిగిన చంద్రబాబు ఓటమిని చవి చూసారు. మరి అప్పుడు కూడా థర్డ్ ఫ్రంట్ ఊసు ఎత్తలేదు. 2009 ఎన్నికలలో మళ్లీ థర్డ్ ఫ్రంట్ జపం చేసి ఎన్నికల బరిలో నిలిచి తాను ఓడిపోవటమే కాక, 2004నాటి పరిస్థితి కన్నా మరిన్ని తక్కువ సీట్లు థర్డ్ ఫ్రంట్ పార్టీలకు వచ్చే పరిస్థితి ఏర్పడింది.

        

మళ్లీ ఇప్పుడు చంద్రబాబు థర్డ్ ఫ్రంట్ జపం చేస్తున్నాడు. 2014 ఎన్నికలలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తెదేపా కీలక పాత్ర వహించే థర్డ్ ఫ్రంట్ అని ఆయన నొక్కి వక్కాణిస్తున్నారు. దీనికి ఆయన చెబుతున్న కారణం యూపీఎ చతికిల పడిపోతోందని, ఎన్ డిఎ కోలుకునే పరిస్థితి లేదు అని. 

        

థర్డ్ ఫ్రంట్ అంటే వివిధ ప్రాంతీయ పార్టీలు, వామపక్షాల కూటమి. ప్రాంతీయ పార్టీలంటే ఒక్కో పార్టీకి ఒక్కో స్వతంత్ర ఎజెండా ఉంటుంది. వివిధ రకాల స్వతంత్ర ఎజెండాలతో, స్వతంత్ర ప్రతిపత్తులతో కలిపిన కూటమి ఎంతవరకు విజయ పథాన నడుస్తుంది? థర్డ్ ఫ్రంట్ కూటమిలో ఉండబోయే పార్టీలు తెదేపా, తెరాస, ఎఐఎడిఎంకె, జెడి(ఎస్), బిఎస్పి.... మొ.నవి, అందులోనూ మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తేనే థర్డ్ ఫ్రంట్ లో బిఎస్పి కొనసాగుతుంది. మరి ములాయం సింగ్, జయలలితలేమి తక్కువవాళ్ళు కారు. మరి ఇంతమంది మనోభావాలను పరిగణలోకి తీసుకుంటూ ఎంత కాలం ఈ అతుకుల బొంత ప్రయాణం సాగుతుంది?

           

చివరిగా అందరి ఉద్దేశ్యం ముస్లిం వోటర్లను ఆకర్షించటం. అందుకోసమే అన్ని ప్రాంతీయ పార్టీలు ఈ థర్డ్ ఫ్రంట్ జపం చేస్తున్నాయి. అయితే ఈ థర్డ్ ఫ్రంట్ కి నాయకత్వాన్ని వహించేది ఎవరు? ఎవరి నాయకత్వాన్ని ఎవరు అంగీకరిస్తారు?

      

దీన్ని బట్టి ప్రజలకు అర్థమవుతోంది థర్డ్ ఫ్రంట్ లో అధికారం కోసం ప్రాంతీయ పార్టీల కుమ్ములాటలే కాని దేశాభివృద్ధి, జాతీయ సమగ్రత ఎక్కడా కాన రాదు అని. ఇన్నీ తెలిసి మళ్లీ థర్డ్ ఫ్రంట్ ప్రతిపాదనని తెర మీదకు తీసుకొస్తున్న చంద్రబాబు నాయుడి అంతర్గత ఉద్దేశ్యం ఏమిటి?