నెల్లూరు జిల్లాల్లో పార్టీ ఓటమికి అసలు కారణాలు తెలుసుకుని షాక్ అయిన చంద్రబాబు.....

 

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చి ఐదు నెలలైంది. ఇప్పుడు పార్టీ ఓటమి పై సమీక్షలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు మొదలుపెట్టారు. కార్యకర్తలపై అధికార పార్టీ నేతల దాడులు బాధితులకు పరామర్శ పేరుతో చంద్రబాబు జిల్లాల పర్యటన చేపట్టారు. తూర్పు గోదావరితో మొదలైన ఈ పర్యటన విశాఖ, నెల్లూరు జిల్లాలో కొనసాగాయి.

రెండు రోజుల పాటు పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. నియోజక వర్గాల వారీగా సమీక్ష కార్యకర్తల కుటుంబాలకు భరోసా ఇచ్చే ప్రయత్నం ఈ సమావేశాల్లో జరిగింది. ఇదంతా ఒకెత్తయితే నెల్లూరు జిల్లాలో పార్టీ ఓటమికి కారణాలు ఏంటి అని చంద్రబాబు నేతలు అడిగారు. జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు ఎంపీ సీట్లను వైసీపీ గెలుచుకుంది.

పార్టీ ఇంతగా నష్టపోవటానికి కారణాలు ఏంటి అని నేతలను సూటిగా చంద్రబాబు ప్రశ్నించారు. దీంతో కొందరు నేతలు సమాధానం చెప్పలేక బిక్కమొహం వేశారు. అయితే కొంత మంది నేతలు మాత్రం మనసు విప్పి మాట్లాడారు.

పార్టీ అధిష్టానం పరంగానే తప్పులు జరిగాయని తప్పులన్నీ మీరే చేసి మమ్మల్ని అడగటం బాగోలేదని కొందరు వాదనలు వినిపించారు. కొన్ని నియోజకవర్గాలు అభ్యర్ధులను మార్చాలనీ ఎన్నికల ముందు పదేపదే చెప్పినా పట్టించుకోలేదని ఏక పక్షంగా అభ్యర్ధులను నిర్ణయించి తమపై రుద్దారని కొందరు కార్యకర్తలు వాపోయారు.

ఇప్పుడు తాము వద్దన్నా నేతల్లో పోటీలోకి దించి వారు ఓడిపోతే తమనడగటం బాలేదని అన్నారు. సూళ్లూరుపేటలో వైసీపీకి అరవై ఒక్క వేల మెజార్టీ ఎలా వచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులు వెంటనే జోక్యం చేసుకొని క్యాండిడేట్ ను మార్చమని పదేపదే విజ్ఞప్తలు చేసినా పట్టించుకోలేదని దాని ఫలితమే అరవై ఒక్క వేల మెజార్టీ అని చెప్పారు. ఎన్నికల ముందు రిజల్ట్ ఊహించి చెప్తే అధిష్ఠానం పట్టించుకోలేదని ద్వితీయ శ్రేణి నాయకత్వం సూచనలకు కనీసం విలువ ఇవ్వలేదని వాపోయారు.

అధిష్టానం తప్పులు చేసి ఇప్పుడు సమీక్షల పేరిట తాము తప్పు చేశామని కలరింగ్ ఇవ్వడం బాగోలేదని సమావేశంలో కార్యకర్తలు కుండ బద్దలు కొట్టారని తెలుస్తుంది. జిల్లాలో ద్వితీయ శ్రేణి నాయకత్వానికి పార్టీ పరంగా సపోర్ట్ లేదని, ఇలాంటి పరిస్థితుల్లో మంచి అవకాశాలు వస్తే పక్క పార్టీ చెంత చేరటానికి  నేతలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు ముందే కొందరు కార్యకర్తలు చెప్పినట్లు సమాచారం. మొత్తానికి నెల్లూరు సమీక్ష సమావేశాలు వాడీవేడిగా జరిగాయని తెలుస్తోంది. ఇవి విన్న చంద్రబాబు ఇక పై ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారో చూడాలి.