కత్తులు పై కాంగ్రెస్ ఫైర్: బాబు ఎదురు దాడి

 

గత146 రోజులుగా పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు నాయుడు, తరచూ సహనం కోల్పోతున్నట్లు కనిపిస్తున్నారు. ఒకప్పుడు కేవలం పార్టీవరకే పరిమితమయిన ఆయన విమర్శలు క్రమంగా వ్యక్తిగత విమర్శలకి కూడా విస్త్రుతించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, బ్రదర్ అనిల్ కుమార్ లపై గత కొద్దికాలంగా ఆయన తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

 

ఆయన తమ కుటుంబ సభ్యులపై చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవధ్యక్షురాలు విజయమ్మ ఆయనపై పరువు నష్టం దావా వేసే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు.

 

మళ్ళీ మొన్న చంద్రబాబు నాయుడు గుంటూరులో తన పాదయాత్ర లో గీత కార్మికులను, రైతులను ‘కత్తులు కొడవళ్ళు పట్టుకొని కాంగ్రెస్ పార్టీని నరకండి’అంటూ నోరుజారడంతో కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించడమే కాకుండా, బేషరతుగా క్షమాపణలు చెప్పకుంటే ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

 

అయితే తానూ ఆవేశంలో ఏదో నోరుజారానని ఒప్పుకొని ఉంటే, ఆయన చంద్రబాబే కాదు గనుక, కాంగ్రెస్ నేతలపై ఎదురుదాడి చేస్తూ “రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నేను ఆవేశంగా మాట్లాడిన మాటలను పట్టుకొని నా మీదే కేసులు పెడతామని బెదిరిస్తారా? మీ బెదిరింపులకి భయపడను. రైతుల ప్రయోజనాలు కాపాడటం కోసం అవసరమయితే జైలుకి కూడా వెళ్లేందుకూ నేను సిద్ధమే. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి చూస్తాను,” అంటూ సవాలు విసిరారు.

 

కాంగ్రెస్ వారు ఆపని ఎలాగూ చేయరని తెలుసు గనుక ఆయన వారిని ఆ విధంగా సవాలు చేస్తున్నపటికీ, ఇకనయినా ఆయన తన అత్యుత్సాహాన్ని కొంచెం తగ్గించుకొని ప్రతిపక్ష నాయకుడిగా కొంచెం హుందాతనం ప్రదర్శించడం మంచిది.