చంద్రబాబు చెప్పిందొకటి... చేసిందొకటి!

 

ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు వున్నాయి అని మహానుభావుడు ఆచార్య ఆత్రేయ ఏనాడో చెప్పాడు. ఈ మాటను నిజం చేయడానికి ఈ ప్రపంచంలో కోట్లాదిమంది నిరంతరం ప్రయత్నిస్తూనే వుంటారు. అలాంటి వారి లిస్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి చేరారు. అసలేం జరిగిందంటే, ఆంగ్ల నూతన సంవత్సరం వచ్చిందంటే చాలు... పార్టీలు చేసుకునేవారు కొంతమంది అయితే, ఆరోజున దేవాలయాలకి వెళ్ళేవాళ్లు మరికొంతమంది. నూతన సంవత్సరం ప్రారంభం రోజున దేవాలయానికి వెళ్తే బోలెడంత పుణ్యం రావడంతోపాటు సంవత్సరం అంతా సంతోషంగా వుంటామన్నది చాలామంది నమ్మకం. అందుకే కొత్త సంవత్సరం రోజున చాలామంది సమీపంలోని దేవాలయాల్లో క్యూలు కడుతూ వుంటారు. మరికొంతమంది అయితే చాలా దూరమైనా సరే ప్రముఖ దేవాలయాలకు వెళ్తూ వుంటారు. అయితే ఈ ధోరణి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నచ్చలేదు. మనం తెలుగు వాళ్ళం.. ఆంగ్ల సంవత్సరాది మన సంప్రదాయం కాదు అని ఫీలయింది. అలా ఫీలయిన వెంటనే ఒక ప్రకటన విడుదల చేసింది. నూతన సంవత్సరం ప్రారంభం రోజున దేవాలయాల్లో ప్రత్యేక పూజల్లాంటివి నిర్వహించడానికి వీల్లేదని సదరు ప్రకటనలో పేర్కొంది. ప్రకటన చూసి కొంతమంది అచ్చ తెలుగువారు చాలా సంతోషించారు. మరికొంతమంది మాత్రం ఏమిటీ చాదస్తం అనుకున్నారు. కొత్త సంవత్సరం రోజున ఎవరి ఇష్టం వారిది... ప్రభుత్వం అనవసరంగా జోక్యం చేసుకుంది అనుకున్నారు.

 

నూతన సంవత్సరం రోజున దేవాలయాల్లో ప్రత్యేక పూజల్లాంటివి నిర్వహించొద్దు అని మాత్రమే ప్రభుత్వం పేర్కొంది. దేవాలయాలకు వెళ్ళొద్దని మాత్రం అనలేదు కాబట్టి ప్రభుత్వాన్ని మనం ఏమీ అనడానికి లేదు. అయితే నూతన సంవత్సరం మొదటి రోజున జరిగిన తంతు చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధినేత చంద్రబాబు చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి అని అనకుండా వుండలేని పరిస్థితి. జనవరి ఒకటో తేదీన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లోని పూజారులు ఉదయాన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళారు. వేద మంత్రోచ్ఛాటనలతో ప్రభుత్వాన్ని, ప్రభుత్వాధినేత చంద్రబాబును ఆశీర్వదించారు. ఈ తతంగమే చాలామందికి కడుపులో మండేలా చేసింది. జనవరి ఒకటిన దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయకూడదన్న చంద్రబాబు... తన ఇంటికి మాత్రం పూజారులను పిలిపించుకుని ఆశీస్సులు అందుకోవడం పట్ల జనం వెటకారంగా మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన గుడికి వెళ్ళా్ల్సిన అవసరం లేదు. గుడే ఆయన దగ్గరకి వచ్చింది. ప్రత్యేక ఆశీస్సులు అందించింది. మరి సామాన్య జనానికి మాత్రం ఆరోజున ప్రత్యేక పూజలు చేయించుకునే అవకాశం లేదు. రాజకీయాల్లో పండిపోయిన చంద్రబాబు ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో పప్పులో కాలు వేస్తూ వుంటాడెందుకో మరి!