చంద్రబాబుని తనిఖీ చేసిన అధికారులు.. భద్రతపై అనుమానాలు?

 

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కామన్ మ్యాన్ అయిపోయారు. హైదరాబాద్‌ వెళ్లేందుకు శుక్రవారం సాయంత్రం విమానాశ్రయానికి వెళ్లిన చంద్రబాబుని విమానాశ్రయ అధికారులు ఒక సాధారణ ప్రయాణికుడిలానే ట్రీట్‌ చేశారు. మెటల్‌ డిటెక్టర్‌ మార్గంలోనే ఆయన విమానాశ్రయం లాంజ్‌లోకి వెళ్లారు. అక్కడ విమానాశ్రయ భద్రతా సిబ్బంది ఆయనను మెటల్‌ డిటెక్టర్‌తో తనిఖీ చేశారు. ఆ తర్వాత ఆయన సాధారణ ప్రయాణికులతో కలసి, వారు ప్రయాణించిన బస్సులోనే వెళ్లి విమానం ఎక్కారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రొటోకాల్‌ ప్రకారం నేరుగా విమానం వద్దకు కాన్వాయ్‌లో వెళ్లేవారు. ఈసారి విమానాశ్రయ భద్రత అధికారులు దానికి అనుమతించకపోవడంతో ప్రతిపక్షనేతయిన ఆయన సాధారణ ప్రయాణికుల మార్గంలో వెళ్లాల్సి వచ్చింది.

సీనియర్‌ నాయకుడు, సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన నాయకుడు చంద్రబాబును విమానాశ్రయ సిబ్బంది, భద్రత అధికారులు ఒక సాధారణ ప్రయాణికుడిలా తనిఖీలు చేయడం దురదృష్టకరమని మాజీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ధ్వజమెత్తారు. జెడ్‌ప్లస్‌ కేటగిరీ భద్రతలో ఉన్న వ్యక్తిని ఇతర ప్రయాణికులతో కలిపి బస్సులో పంపించడం ఎంత వరకు సమంజసమని, భద్రతాపరమైన సమస్యలు తలెత్తితే ఎవరు సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు భద్రత విషయంలో ప్రభుత్వ వైఖరి పట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళనలో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.