మళ్ళీ ఎన్నికలకు రండి... జగన్ కు బాబు సవాల్!!

ఏపీ రాజధాని మార్పు విషయంలో అధికార ప్రతిపక్ష నేతల గొడవలు నడుస్తుంటే.. సామాన్యులు సతమతవుతున్నారు. ఈ తరుణంలో సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. రాజధాని మార్పునకు మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రజామోదం ఉందనుకుంటే రిఫరెండం నిర్వహించండి అని సీఎం జగన్ కు టిడిపి అధినేత చంద్రబాబు సవాలు విసిరారు. ఐదు కోట్ల మంది ప్రజలు ఇచ్చే తీర్పుకు కట్టుబడి ఉంటానని అన్నారు. అలా కాదనుకుంటే రాజధాని మార్పు ఎజెండాగా మళ్లీ ఎన్నికలకు రండి ప్రజల్లోకి వెళ్దాం వారే తీర్పు ఇస్తారని పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని వేదిక కల్యాణ మండపంలో అమరావతి పరిరక్షణ జెఎసి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జై అమరావతి అని నినదిస్తూ.. ఎవరు అడిగారని ? ఏ అధికారము ఉందని.. రాజధాని మార్పునకు జగన్ ప్రభుత్వం పూనుకుందని బాబు నిలదీశారు. కులం అంటారు.. ప్రాంతం అంటారు..రాజధాని అమరావతిలోనే ఉండాలని పోరాడుతున్న సీపీఐ నేత రామకృష్ణను ఉదాహరణకు తీసుకొని.. ఆయనది నాది ఒకే కులమా ? ఆయన రామకృష్ణ చౌదరా ? మా ఇద్దరిదీ ఈ ప్రాంతమా ? ఎన్నికల్లో మేమెవరమైనా కలిసి పోటీ చేశామా ? అంటూ ప్రశ్నించారు. జేఏసీ పిలుపుతో అందరం ఒకే వేదిక పైకి వచ్చామని తెలిపారు. 

రాజధాని నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని వేసింది. అనుకూలతలో విజయవాడ, గుంటూరు నగరాలకే ఆ కమిటీ ఎక్కువ మార్కులిచ్చింది. భూమి లేకపోవటం ఒకటే లోటని అందులో పేర్కొంది. స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలు ఇవ్వటం ద్వారా రైతులు ఆ లోటును కూడా పూడ్చారు. ఈ ప్రాంతంలో రాజధాని ఉండటానికి జగన్ కూడా అసెంబ్లీలో అంగీకారం తెలిపారు. కానీ రాజధానికి 30 వేల ఎకరాలు కావాలనడంతో.. మేం 54 వేల ఎకరాలు సేకరించి చూపించాము. ఇటీవలి ఎన్నికల ముందు వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసే సమయంలో రాజధాని మార్చేది లేదని అమరావతి లోనే ఉంటుందని ఆ పార్టీ మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. అలాంటిది ఇప్పుడెలా మారుస్తారు ? విశాఖ ప్రజలు వాళ్లకు రాజధాని కావాలని జగన్ ను అడిగారా? అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉన్న రాజధానిని ఎందుకు మారుస్తున్నారో జగన్ చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వ చర్యలతో ప్రజలు ఆగ్రహంతో దహించుకుపోతున్న సహనంతో వ్యవహరిస్తున్నారు. ఆ ఆగ్రహం బద్దలైతే ఈ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసి పోవటం ఖాయమని జోస్యం చెప్పారు.  గుంటూరులో నాలుగైదు వేల మంది మహిళలు స్వచ్ఛందంగా ర్యాలీ చేశారు. వారి పట్టుదల నన్ను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. అమరావతికి డబ్బులు లేవంటున్నారు వైసీపీ నేతలు. రాజధాని నడపటానికి పైసా ఖర్చు చేశారా ? ప్రభుత్వం పనిచేయటం ఏమైనా ఆగిందా ? అమరావతిలో హ్యాపీనెస్ట్ పేరుతో అపార్టుమెంట్ల నిర్మాణం చేపడితే ప్రభుత్వానికి వాటిపై 200 కోట్ల లాభం వచ్చింది. ఇప్పుడు మూడు రాజధానులు అంటే దేశమంతా తెలుగు వారిని చూసి నవ్వుకునే పరిస్థితి తెచ్చారని చెప్పారు చంద్రబాబు.