కేంద్రం ఇప్పుడేం చెబుతుందో...!

 

ఏపీలో ఇటీవల హాట్ టాపిక్ గా మారిన విషయం ఏదైనా ఉంది అంటే.. అది పోలవరం గురించి అని చెప్పొచ్చు. ఎప్పుడైతే కాఫర్ డ్యామ్ పేరుతో పోలవరానికి కేంద్రం అడ్డుపుల్ల వేసిందో అప్పటినుండి.. పోలవరం పై చర్చలు నడిచాయి. ఇక ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా రాష్ట్రప్రభుత్వాన్ని, చంద్రబాబుని ఏకిపారేద్దామని ఎదురుచూసే వైసీపీ అయితే.. ఈ కారణం చూపించి.. చంద్రబాబుపై మాటలతో దాడి చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పోలవరం దర్శించి.. పోలవరంపై స్పందించి ఏపీ ప్రభుత్వంపై..చంద్రబాబుపై సీరియస్ అవ్వడంతో ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది. మరి కేంద్రం చేసిన పనికి.. ఇన్ని రోజులు కేంద్రం ఏం చేసినా సైలెంట్ గా ఊరుకున్న చంద్రబాబు మాత్రం పోలవరం పై కేంద్రం తీరు చూసి ఫైర్ అయ్యారు.

 

కానీ ఇప్పుడు 2018 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న చంద్రబాబు కోరిక తీరే అవకాశం దక్కింది. నిర్మాణ పనులపై ఇటీవల ఏర్పడ్డ గందరగోళం ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో కొలిక్కివచ్చేసింది. కాఫర్‌ డ్యాం పేరుతో ఏపీ ప్రభుత్వం ప్రకటించిన టెండర్లను సైతం ఆపేసిన కేంద్రానికి జాతీయ జల విద్యుత్ పరిశోధన బృందం ఓ ఝలక్ ఇచ్చింది.  ఓ వైపు నుంచి కాఫర్‌ డ్యాం, మరోవైపు నుంచి ప్రధాన డ్యాం నిర్మించుకుంటూ వెళ్లి వీటిని అనుసంధానించడం ద్వారా నీటిని నిలబెట్టుకోవచ్చంటూ జాతీయ జల విద్యుత్ పరిశోధన బృందం (ఎన్‌హెచ్‌పీసీ) కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చేసింది. అంతేకాదు.. చంద్రబాబు ఆశిస్తున్నట్టు ఈ సీజన్‌కు నీటిని నిలిపి గ్రావిటీ ద్వారా కాల్వలకు విడుదల చేసుకోవచ్చని తెలిపిందట. ఆ తర్వాత మిగిలిన ప్రధాన డ్యాం పనులు పూర్తి చేయొచ్చని సూచించిందట.ఇలా చేయడం వల్ల ఎగువ కాఫర్ ‌డ్యాం నిర్మాణ వ్యయం కూడా తగ్గిపోతుందని కేంద్రానికి నిపుణుల బృందం కేంద్రాని తెలిపినట్లు తెలుస్తోంది.

 

అంతేకాదు.. ఎగువ కాఫర్‌ డ్యాం 42.5 మీటర్లకు పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై కూడా స్పందించి...  ఎగువ కాఫర్ డ్యాంను 42.5 మీటర్లకు పెంచేందుకు అభ్యంతరం లేదంటూనే… ప్రధాన డ్యాం నిర్మాణాన్ని 42.5 మీటర్లకు నిర్మించాలని తెలిపింది. ఎగువ కాఫర్‌ డ్యాంను పూర్తిగా నది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కాకుండా…. సగం వరకు కాఫర్ డ్యాం, మిగిలిన సగం ప్రధాన డ్యాం నిర్మించి రెండింటినీ అనుసంధానించాలని తెలిపింది. దీని ద్వారా నీటిని నిలుపుదల చేసి వచ్చే ఖరీప్ నాటికి కాల్వలకు గ్రావిటీ ద్వారా నీటిని విడుదల చేయొచ్చని సూచించింది. సో.. దీనివల్ల 2018 నాటికే పోలవరం ద్వారా నీళ్లివ్వాలన్న చంద్రబాబు కల నెరవేరుతుందన్నమాట. మొత్తానికి చంద్రబాబు ఖాతాలో మరో పెద్ద విజయం దక్కినట్టే.. మరి దీనిపై అసలు కేంద్రం ఎలా స్పందిస్తుందో చూద్దాం...