శ్రీకాకుళం ప్రజాగర్జనలో చంద్రబాబు ప్రసంగం

 

ఈరోజు శ్రీకాకుళంలో తెదేపా నిర్వహించిన ప్రజాగర్జన సభకు ఊహించిన దానికంటే ఎక్కువగా జనం పోటెత్తారు. వారిని చూసి చంద్రబాబు కూడా చాలా ఉత్సహంగా ప్రసంగిస్తూ, కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా ఎండగట్టారు. గత పదేళ్ళ యూపీఏ పాలనలో దేశంలో అవినీతి, కుంభకోణాలు, అధిక ధరలు, బీదరికం తప్ప మరేమీ పెరగలేదని ఎద్దేవా చేసారు. ఈ పదేళ్ళ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ దేశాన్ని, రాష్ట్రాన్ని కూడా సర్వనాశనం చేసి వదిలిపెట్టిందని, అందువల్ల ఇకపై ఇటలీ దొరసాని సోనియమ్మను, ఆమె నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీని కూడా బయటకు సాగానంపవలసిన సమయం వచ్చిందని ఆయన అన్నారు.

 

తాను తెలంగాణా ఏర్పాటుకి అంగీకరిస్తూ లేఖ ఇవ్వడం నిజమే గానీ, ఇంత అన్యాయంగా విడదీయమని ఎన్నడూ సూచించలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తన స్వలాభం కోసం తెలుగు ప్రజలనే కాక స్వంత పార్టీ నేతలకి కూడా తీరని ద్రోహం చేసిందని ఆరోపించారు. చంద్రబాబు తాను అధికారంలో ఉన్నపుడు ఏవిధంగా ఎన్డీయే ప్రభుత్వంతో సత్సంభందాలు నెరుపుతూ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చింది వివరించి, ఇప్పుడు కూడా తెదేపాకే అధికారం ఇస్తే అత్యంత దైన్యస్థితిలో ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టి ప్రగతి పధాన్న పయనింపజేస్తానని హామీ ఇచ్చారు.

 

శ్రీకాకుళానికి చెందిన తెదేపా నేత స్వర్గీయ ఎర్రం నాయుడు సేవలను ప్రజలకు గుర్తు చేసి, అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఏవిధంగా జిల్లాను, గిరిజనులు నివసించే కన్నెధార కొండను కూడా దోచుకోన్నాడో సవివరంగా తెలియజేస్తూ, సరయిన నాయకుడికి, పార్టీకి ఓటేయడం ఎంత అవసరమో చంద్రబాబు వివరించారు.

 

ఇక ఈసారి తన ప్రసంగంలో చంద్రబాబు ఒక ఆసక్తికరమయిన కొత్త పధకం ప్రకటించారు. తమిళనాడులో జయలలిత ప్రభుత్వానికి ఎంతో పేరు తెస్తున్న ‘అమ్మ క్యాంటీన్’ లాగే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రమంతటా యన్టీఆర్ క్యాంటీన్లు ప్రారంబించి అందులో పేదలకు కేవలం రూ.5కే భోజనం పెడతామని ప్రకటించారు.