చంద్రబాబు యాత్రకి పార్టీ నేతల అభ్యంతరాలు

 

దాదాపు ఏడాది క్రితం చంద్రబాబు పాదయాత్ర మొదలుపెట్టే ముందు తెదేపా పరిస్థితి ఏవిధంగా ఉందో మళ్ళీ నేడు కూడా అదే పరిస్థితిలో ఉంది. ఆయన పాదయాత్ర ముగిసేసరికి పార్టీ పరిస్థితిలో గణనీయమయిన మార్పు కనబడినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ చేసిన రాష్ట్ర విభజన ప్రకటనతో తెదేపా పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. మరో విశేషం ఏమిటంటే క్రిందటిసారి ఆయన పాదయాత్రని పార్టీ నేతలందరూ స్వాగతించగా ఈ సారి మాత్రం సీమంధ్రలో కొందరు నేతలు వ్యతిరేఖిస్తున్నట్లు సమాచారం.

 

రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఏ పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవలసి వచ్చిందో ప్రజలకు వివరించాలని ఆయన భావిస్తుంటే, అదే కారణంతో ఆయన యాత్రను కొందరు నేతలు వ్యతిరేఖిస్తున్నట్లు తెలుస్తోంది. తెదేపా ఇచ్చిన లేఖవల్ల సీమాంధ్ర ప్రాంతంలో తాము ప్రజలకు జవాబు చెప్పుకోలేని పరిస్థితులు కలిగాయని, ఇప్పుడు చంద్రబాబు యాత్రతో మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని వారు భయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన న్యాయబద్దంగా జరగాలని కోరుతున్నపటికీ తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకి అనుకూలంగా మాట్లాడుతున్నకారణంగా ఆయన రాకవల్ల తమకు కొత్త ఇబ్బందులు కలుగుతాయని భయపడుతున్నారు.

 

కానీ చంద్రబాబు ఇప్పటికయినా తెలంగాణాపై తమ పార్టీ వైఖరి స్పష్టం చేయకపోతే, తెలంగాణాలో నష్టపోవడం ఖాయం. అదేసమయంలో తెలంగాణా అనుకూల వైఖరిని ప్రదర్శిస్తే సీమాంధ్ర ప్రాంతంలో ఆయన ఒంటరి అవడం ఖాయం. రెండు ప్రాంతాలలో పార్టీని కాపాడుకోవడం నిజంగా కత్తిమీద సాము వంటిదే. తన పాదయాత్రతో పార్టీకి బలం చేకూర్చిన చంద్రబాబు ఈ సారి చేపడుతున్నయాత్రతో పార్టీకి ఏవిధంగా మార్గ దర్శనం చేస్తారో చూడాలి.