కలహాల కాపురం ఇంకెంతకాలం?

 

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీల మధ్య వున్నది స్నేహమా, శత్రుత్వమా అనే ప్రశ్న బేతాళ ప్రశ్నకంటే చాలా క్లిష్టమైన ప్రశ్న. సాక్షాత్తూ విక్రమార్కుడే దిగివచ్చినా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక గుడ్లు తేలేస్తాడు. విక్రమార్కుడి దాకా ఎందుకు... ఏపీ బీజేపీ, టీడీపీ నాయకులను అడిగినా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేరేమో... ఎందుకంటే వారు ప్రస్తుతం ఏ స్థితిలో వున్నారో వారికే స్పష్టంగా తెలియదు మరి!

 

ఒకపక్క ఏపీ బీజేపీ నాయకులు టీడీపీతో అర్జెంటుగా తెగదెంపులు చేసుకోవాలని, వైసీపీతో స్నేహం చేసి వచ్చే ఎన్నికలలో అద్భుతమైన విజయాలు సాధించాలని తహతహలాడుతున్నారు. ఏపీకి కేంద్రం నుంచి రావలసిన నిధులకు బ్రేక్ వేసేపనిని విజయవంతంగా పూర్తి చేశారు. మరోవైపు రాయలసీమలో ఏపీ రెండో రాజధానిని ఏర్పాటు చేయాలంటూ నిప్పుల కుంపటిని రగిల్చారు. ఇంకోవైపు ప్రభుత్వంలోనే వుంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు... ఒకపక్క ఇవన్నీ చేస్తూనే మరోపక్క అధికారంలో భాగస్వామ్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి మిత్రుడు శత్రువుకు కూడా వుండకూడదని అనిపించేలా వ్యవహరిస్తున్నారు. అన్నీ చేస్తున్నారుగానీ, టీడీపీ ప్రభుత్వం నుంచి బయటకి వచ్చే సాహసం మాత్రం చేయడం లేదు.

 

వీళ్ళ వ్యవహార శైలి ఇలా వుంటే టీడీపీ నాయకుల వ్యవహార శైలి మరోలా వుంది. కేంద్రంలో వున్న బీజేపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదు. రాష్ట్రంలో వున్న బీజేపీ నాయకుల నుంచి తిట్లు, శాపనార్థాలు తింటూనే వున్నారు. వైసీపీ, బీజేపీల మధ్య రోజురోజుకూ పెరుగుతున్న స్నేహబంధాన్ని గమనిస్తూనే వున్నారు. అయినప్పటికీ కేంద్రంలో వున్న రెండు మంత్రిపదవులను వదలడానికి మాత్రం మీన మేషాలు లెక్కపెడుతున్నారు. ఏపీ ప్రజలు మాత్రం ఈ రెండు పార్టీల ధోరణిని జాగ్రత్తగా గమనిస్తున్నారు.