కృష్ణ... కృష్ణా!

 

కులం గొప్పదా? మతం గొప్పదా? దీనికి ఎవరమైనా ఏం చెబుతాం? పైకి మనం ఎలాంటి సమాధానాలు చెప్పినా లోలోన మాత్రం అందరూ అంగీకరించేది ఒక్కటే! మన దేశంలో మతం చాలా బలమైంది. కాని, కులం మతం కంటే కూడా బలవత్తరమైంది. ఈ విషయం మరోసారి చాగంటి వారి యాదవుల వివాదంతో నిరూపితమైంది!


చాగంటి కోటేశ్వర్ రావు ప్రవచనకర్త. ఆయన ప్రవచనాల గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సింది లేదు. మరే పండితుడికీ దక్కని గౌరవం, అభిమానం ఆయనకు దక్కుతున్నాయి. బహుశా అందుకేనేమో అన్నట్టు ఆయన మీద పదే పదే వివాదాలు రాజుకుంటున్నాయి. ఆ మధ్య ఆయన శిరిడీ సాయిని అవమానించారని తెగ రాద్ధాంతం జరిగింది. కాని, ఆయన తనకు సాయిబాబాపై ఎలాంటి చెడు ఉద్దేశం లేదని వివరణ ఇచ్చుకున్నారు. ఆ సమయంలో చెలామణి అయిన వీడియోల్లో కూడా ఆయన సాయిని కావాలని దుర్భాషలాడినట్టు ఎక్కడా కనిపించలేదు. అయినా కూడా ఎలక్ట్రానిక్ మీడియా సందట్లో సడేమియా వ్యవహారం నడిపి టీఆర్పీలు దండుకుంది. ఇప్పుడూ అలాగే జరిగింది యాదవుల విషయంలో...


చాగంటి వారు శ్రీరాముడు దశరథ మహారాజుకి జన్మించాడనీ...కాని, శ్రీకృష్ణుడు అమాయకులు, డాంభికం ఎరగని యాదవుల కులంలో పుట్టాడని అన్నారు. ఇందులో వాళ్లని పొగడటమే తప్ప చులకన చేయటం ఏమీ లేదు. కాకపోతే, అలవాటులో భాగంగా ఆయన జాతీయం వాడారు. తల కడిగితే మొల కడగరు, మొల కడిగితే తల కడగరని! ఇది యాదవుల్ని అవమానించటమే అంటూ కొందరు బయలుదేరారు. వాళ్ల గొంతు కేవలం సోషల్ మీడియాలోనే అయితే పెద్దగా వినిపించేది కాదు. ఇందులో ఘుమఘుమలాడే టీఆర్పీలు వుండటంతో మీడియా ఎంటరైంది. అక్కడే అసలు రచ్చ మొదలైంది. టీవీ స్టూడియోల్లో చాగంటి వారి ప్రవచనంపై, మాటపై చర్చ పెట్టడంతో తెలుగు రాష్ట్రాల్లోని యాదవులంతా ఆగ్రహించారు. మీడియా అత్యుత్సాహం చూపకపోతే అసలు వారందరికీ అది తెలిసేది కూడా కాదు! 


మీడియా చెప్పకపోతే చాగంటి వారి మాటలు యాదవులకి తెలిసేవి కావు. కాబట్టి మీడియా చేసింది తప్పు అనటం సబబు కాదు. ఒక కోణంలో చూస్తే చాగంటి వారి మాట యాదవుల్ని కించపరిచేదే. కాని, దాని వెనుక ఆయన ఉద్దేశం వారి అమాయకత్వాన్ని, దేవుడు సైతం వారి ప్రేమకు లోంగాడని చెప్పటం అయినప్పుడు కాస్త అర్థం చేసుకోవాలి కదా? యాదవుల్ని దురుద్దేశంతో తిట్టిపోయటానికి చాగంటి వారు అలా మాట్లాడారా అన్నది మీడియా పట్టించుకోలేదు. పదే పదే చర్చలు పెట్టి యాదవుల అహం దెబ్బతీసింది. చాగంటి వారి చేత క్షమాపణలు చెప్పించింది.


చాగంటి కోటేశ్వర్ రావు లాంటి పండితుడు వినమ్రంగా క్షమాపణ చెప్పటం ఆహ్వానించదగ్గదే. యాదవులు కూడా దీని వల్ల శాంతించారు. కాని, ఇప్పుడు అంతా ఆలోచించుకోవాల్సింది ఒక్కటే... ఏ ఆర్దిక లాభమూ ఆశించకుండా ప్రవచనాలు చెప్పే చాగంటి వారు అనుకోకుండా నోరు జారటం ప్రమాదమా? కావాలని ఉద్దేశ్యపూర్వకంగా వివిధ కులాల్ని కించపరిచే రకరకాల సినిమాలు ప్రమాదమా? మన సినిమాల్లో యాదవుల్ని ఏ విధంగా చీత్రకరిస్తారో ప్రత్యేకంగా చెప్పాలా? బ్రాహ్మణుల మొదలు జవాన్ల దాకా మన సినిమాల్లో ఏ వర్గాన్నీ వదిలి పెడుతున్నారనీ? అందర్నీ రకరకాలుగా అవమానిస్తూనే వున్నారు. పైగా కోట్ల రూపాయల కలెక్షన్లు కొల్లగొడుతున్నారు. కొన్ని టీవీ షోల్లోనూ కామెడీ పేరుతో వివిధ వృత్తుల వార్ని ఎంతగా కించపరుస్తున్నారో మీడియాకి తెలియదా? 


నిజంగా వివిధ కులాల్ని అవమానించే వ్యాపార ముఠాలకి ఛానల్సు , పేపర్సు వంత పాడుతూ , వాటితో కలిసి తమ వ్యాపార లాభాలు సంపాదించుకుంటూ ... చాగంటి లాంటి సౌమ్యుడైన ఒంటరి ప్రవచనకారుడిపై ప్రతాపం చూపటం... మీడియానే తన మనః సాక్షితో పరీక్ష చేసుకోవాల్సిన విషయం...