కరోనా వ్యాక్సిన్ రెండేళ్లవరకు రాకపోవచ్చు.. సీసీఎంబీ డైరెక్టర్ 

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్న సమయంలో.. సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా షాకింగ్ న్యూస్ చెప్పారు. రెండేళ్ల వరకు కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదని అయన బాంబు పేల్చారు. అంతేకాకుండా భారతదేశంలో కరోనా వైరస్ తగ్గిపోయిందని ఎవరైనా అనుకుంటే పొరపాటేనని అయన అన్నారు. కొంతమంది కరోనా వైరస్‌ను తక్కువగా అంచనా వేస్తున్నారని.. ప్రజలు అపోహలు వదిలి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయన సూచించారు. మరో పక్క భారత్ బయోటెక్, అరబిందో ఫార్మాతో సహా వివిధ కంపెనీలతో కలసి వ్యాక్సిన్ కోసం తాము పరిశోధనలు జరుపుతున్నామని అయన తెలిపారు. అయితే వచ్చే ఏడాది నాటికి వ్యాక్సిన్ పై ఒక స్పష్టత రావొచ్చన్నారు. అంతేకాకుండా కోట్ల మందికి వ్యాక్సిన్ తీసుకురావటం అనేది చాలా కష్టమైన వ్యవహరమని అయన చెప్పారు.

 

తాము జరిపే పరిశోధనలకు తోడు అదృష్టం కూడా కలసిరావాలని అయన చెప్పారు. తాజాగా హైదరాబాద్ ఆసుపత్రుల్లో కరోనా రోగులు తగ్గటం సంతోషకరమన్నారు. అయితే ఆసుపత్రులను పరిశీలించి కరోనా వైరస్ ప్రభావం తగ్గిందని అంచనాకు రాకూడదని ఆయన స్పష్టం చేసారు. పుట్టగొడుగుల్లో ఉండే ఒక పదార్ధాన్ని సేకరించి AICతో కలసి తాము ఇమ్యూనిటీ బూస్టర్‌ను అభివృద్ధి చేశామని తెలిపారు. కరోనా వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవటానికి కమ్యూనిటీ బూస్టర్ రోగనిరోధక శక్తి ఉపయోగపడుతుందన్నారు. ప్రజలు తమ ఆహారంతో కలపి ఈ ఇమ్యూనిటీ బూస్టర్ ను తీసుకోవాలని రాకేష్ మిశ్రా సూచించారు. చాలా కాలంగా భారతీయులు పుట్టగొడుగులను ఆహారంగా తీసుకుంటున్నారని చెప్పారు. ఈ ఇమ్యూనిటీ బూస్టర్ వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తే అవకాశం లేదని అయన తెలిపారు.