ప్రధాని సన్నిహితుడు లంచం కేసులో పట్టుబడ్డాడు

 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విరుచుకుపడేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ వదులుకోవడం లేదు.తాజాగా సీబీఐలో చోటుచేసుకున్న అంతర్గత కుమ్ములాటలపై ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రాజకీయ ప్రతీకారం తీర్చుకునే ఓ ఆయుధంలా సీబీఐ తయారైందని రాహుల్‌ గాంధీ విమర్శించారు.తాజాగా ఓ అవినీతి కేసులో సీబీఐ తమ సొంత శాఖ డైరెక్టర్ రాకేశ్‌ అస్తానాపై కేసు నమోదు చేసింది.మాంసం ఎగుమతి చేసే వ్యాపారవేత్త మోయిన్‌ ఖురేషిపై మనీలాండరింగ్‌, అవినీతి, అక్రమాస్తుల ఆరోపణలు రాగా ఆయనపై సీబీఐ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ కేసులో రాకేష్‌ అస్తానా ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది.అయితే, ఖురేషి నుంచి ఆయన లంచం డిమాండ్‌ చేసి తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ కేసులో అస్తానాను నంబర్‌.2 గా పేర్కొంటూ సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.

సీబీఐ స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేశ్ అస్థానాపై స్వయంగా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు వచ్చిన వార్తలపై రాహుల్ ఇవాళ ట్విటర్లో స్పందించారు. ‘‘ప్రధానమంత్రి సన్నిహితుడు, గోద్రా సిట్ ఫేమ్, గుజరాత్ కేడర్ అధికారి, సీబీఐలోకి నెంబర్ 2గా చొరబడిన వ్యక్తి, ఇప్పుడు ఓ లంచం కేసులో పట్టుబడ్డాడు...మోదీ ప్రభుత్వ పాలనలో రాజకీయ కక్ష సాధింపు కోసం వాడుకునే ఆయుధంలా సీబీఐ తయారైందన్నారు.ఎంతో ఔన్నత్యమున్న విచారణ సంస్థ ఇప్పుడు క్షీణ దశకు చేరుకుందనీ..  వాళ్లలో వాళ్లే కొట్టుకునే పరిస్థితి వచ్చిందని’’ రాహుల్ వ్యాఖ్యానించారు.