కేసీఆర్, హరీష్ రావులపై సీబీఐ విచారణ

 

ఈ ఎన్నికలలో గెలిచి తెలంగాణకు మొట్ట మొదటి ముఖ్యమంత్రి అవుదామని కలలుకంటున్న తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కి ఈరోజు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బాలాజీ వదేరా అనే న్యాయవాది వేసిన ఒక పిటిషనుపై స్పందించిన సీబీఐ ప్రత్యేక కోర్టు, కేసీఆర్, ఆయన మేనల్లుడు హరీష్ రావు, మాజీ తెరాస నేత మరియు ప్రస్తుత కాంగ్రెస్ నేత అయిన విజయ శాంతి ముగ్గురిపై వెంటనే యఫ్.ఐ.ఆర్. నమోదు చేసి వారు ఆస్తులపై విచారణ చెప్పట్టాలని సీబీఐని ఆదేశించింది.

 

ఊహించినట్లుగానే, హరీష్ రావు దీనిపై స్పందిస్తూ “కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యర్ధులు దారికి రానప్పుడు తన చేతిలో ఉన్న సీబీఐని వారిపైకి ఉసిగొల్పడం కొత్తేమీ కాదు. ఈ ఎన్నికలలో కేసీఆర్ ధాటికి తట్టుకోలేక ఎన్నికలలో ఓడిపోతామని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ తనకలవాటయిన విద్య ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్ బెదిరింపులకి మేము బెదిరేవాళ్ళము కాము. మేము ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రాగానే కాంగ్రెస్, తెదేపా నేతలపై విచారణ జరిపించి దోషులని తెలిసిన వారిని జైలుకి పంపడం ఖాయం,” అని ఘాటుగా జవాబిచ్చారు.

 

ఇక ఇటీవలే తెరాసను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి కూడా దీనిపై స్పందిస్తూ “కోర్టు ఆదేశాలను నేను మనస్పూర్తిగా స్వాగతిస్తున్నాను. సీబీఐ వెంటనే దర్యాప్తు మొదలుపెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను,” అని అన్నారు.