బీజేపీ వాదన ప్రజలకు నచ్చుతుందా?

 

కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ సమర్పించిన బడ్జెట్ పై ఊహించిన దానికంటే చాలా ఎక్కువగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యతిరేకత ఎదురవుతోంది. అధికార తెదేపాతో సహా అన్ని పార్టీలు కూడా బడ్జెట్ లో రాష్ట్రానికి తగినన్ని నిధులు కేటాయించకపోవడాన్ని ముక్తకంటంతో నిరసిస్తున్నాయి. పార్లమెంటులో కాంగ్రెస్, వైకాపా యంపీలు ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నప్పుడు తాము ఎటువంటి వైఖరి అవలంభించాలనే సందిగ్ధంలో ఉన్న తెదేపా యంపీలు ఇప్పుడు ఆ సందిగ్ధంలో నుండి పూర్తిగా బయటపడేందుకు ఈ బడ్జెట్ తోడ్పడిందని చెప్పవచ్చును. కానీ త్వరలో చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీని కలిసి మాట్లాడిన తరువాత, ఆయన ఇచ్చిన హామీలను చూసి, అవి సంతృప్తికరంగా లేకపోయినట్లయితే అప్పుడు వారు కూడా కాంగ్రెస్, వైకాపా సభ్యులతో కలిసి ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలదీయవచ్చును.

 

బీజేపీకి మిత్రపక్షంగా ఉంటూ, కేంద్రంలో భాగస్వామిగా ఉంటూ, రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కేంద్రమంత్రులుగా ఉన్నప్పటికీ తెదేపా ప్రభుత్వం కేంద్రం నుండి తగినన్ని నిధులు రాబట్టుకోవడంలో విఫలమయిందని ప్రతిపక్షాలు దెప్పిపొడుస్తున్నాయి. అదేవిధంగా రాష్ట్ర విభజన బిల్లుని పార్లమెంటులో ఆమోదించే సమయంలో, ఆ తరువాత ఎన్నికల ప్రచారసభలలో బీజేపీ నేతలు అందరూ రాష్ట్రానికి పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఈవిధంగా మొండి చెయ్యి చూపడాన్ని రాజకీయ పార్టీలే కాదు ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అధికార, విపక్షాలు, మీడియా, రాజకీయ విశ్లేషకులు, ప్రజలు అందరూ మూకుమ్మడిగా బీజేపీని, ఎన్డీయే ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తుంటే వారందరికీ సమాధానాలు, సంజాయిషీలు చెప్పుకోలేక రాష్ట్ర బీజేపీ నేతలు నానా ఇబ్బందులుపడుతున్నారు.

 

తెదేపా కటినమయిన నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు ఇప్పటికే స్పష్టం చేస్తోంది, గనుక తెదేపా పట్ల బీజేపీ నేతల వైఖరిలో కూడా క్రమంగా మార్పు కనబడుతోంది. తెదేపా ప్రభుత్వం కేంద్రానికి సరయిన ప్రతిపాదనలు పంపకపోవడం వలననే, కేంద్రం రాష్ట్రానికి నిధులు మంజూరు అవలేదనే వితండ వాదన బీజేపీ నేతలు అందుకొన్నారు. అయినప్పటికీ కేంద్రం రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులకు చాలా ఉదారంగా నిధులు విడుదల చేసిందని, కేంద్ర పన్ను ఆదాయంలో నుండి రాష్ట్రానికి పది శాతం అధికంగా నిధులు కేటాయించినందున రానున్న ఐదేళ్ళ కాలంలో రాష్ట్రానికి దాదాపు రెండు లక్షల కోట్లు రాబోతున్నాయని బీజేపీ రాష్ట్ర నేతలు ప్రజలకు, విమర్శకులకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ వాదనలు, సంజాయిషీలతో విమర్శల నుండి బీజేపీ నేతలు తమను తాము కాపాడుకోలేక పోతున్నారు. ప్రజలను కూడా సంతృప్తి పరచలేకపోతున్నారనేది సుస్పష్టం.

 

ఇటువంటి పరిస్థితుల్లో వారు మిత్రపక్షమయిన తెదేపాతో, రాష్ట్రంలో ప్రతిపక్షాలతో, ప్రజలతో పట్లుపడుతూ ప్రయాసపడే బదులు, డిల్లీ వెళ్లి తమ అధిష్టానానికి రాష్ట్రంలో పరిస్థితులు వివరించి, తగిన విధంగా స్పందించమని కోరితే మంచిది. అలాకాక ఇదేవిధంగా వ్యవహరిస్తూ కాలక్షేపం చేసినట్లయితే పార్టీకి వారు ఊహించనంత నష్టం జరిగే అవకాశం ఉంది. పైగా తెదేపా సంబంధాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఏ రాజకీయ పార్టీకయినా మిత్రధర్మం పాటించేందుకు కొన్ని పరిమితులు ఉంటాయి. దానికోసం రాజకీయ పార్టీలు తమ ఉనికిని, మనుగడను పణంగా పెట్టలేవనే సంగతి చాలా సార్లు నిరూపితమయింది. ఇప్పుడు  తెదేపా, బీజేపీలు కూడా అటువంటి పరీక్షనే ఎదుర్కొంటున్నాయి. అయితే ఇప్పటికీ వాటికి ఈ పరీక్షలో నెగ్గేందుకు అవకాశాలున్నాయి. ముందు ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా ఇరు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకోవడం వలన రెండు పార్టీలకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది.

 

ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికున్న ప్రత్యేక సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వానికి, దానిని నడుపుతున్న బీజేపీకి, రాష్ట్ర బీజేపీ నేతలకి అందరికీ కూడా తెలుసు. కనుక ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేసే బదులు ఆ సమస్యలను పరిష్కరించేందుకు గట్టిగా ప్రయత్నిస్తే మంచిది. తెదేపా, బీజేపీలు తమ సంబంధాలు కొనసాగించినా తెంచుకొన్నా ప్రజలు పట్టించుకోబోరు. కానీ ఈ ఐదేళ్ళలో జరిగిన రాష్ట్రాభివృద్ధినే కొలమానంగా చేసుకొని వచ్చే ఎన్నికలలో ప్రజలు ఆ రెండు పార్టీలని తూకం వేస్తారనే సంగతి విస్మరించకూడదు.