బ్రాహ్మణి వర్సెస్‌ భారతి? విజయవాడ ఇన్‌ఛార్జ్‌గా లోకేష్‌ అందుకేనా?

 

తెలుగుదేశానికి చంద్రబాబే మెయిన్‌... ఆయనే స్పెషల్‌ అట్రాక్షన్‌... జనాలు ఓట్లేసేది చంద్రబాబును చూసే... వారసుడిగా నారా లోకేష్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చినా, మంత్రిగా ఉన్నా... ప్రజలు మాత్రం చంద్రబాబును దృష్టిలో పెట్టుకునే టీడీపీకి ఓట్లేస్తారు. అయితే ఇప్పుడు చంద్రబాబు కోడలు, లోకేష్‌ వైఫ్‌... నారా బ్రాహ్మణి కూడా రాజకీయాల్లోకి రానుందనే ప్రచారం జరుగుతోంది, అంతేకాదు వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీకి దిగుబోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే విజయవాడ పార్లమెంట్‌ ఇన్‌ఛార్జ్‌గా మంత్రి లోకేష్‌ని చంద్రబాబు అపాయింట్‌ చేశారని అంటున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో విజయవాడ సీటును బ్రాహ్మణికి కేటాయిస్తారన్న సంకేతాలతోనే ప్రస్తుత ఎంపీ కేశినేని నాని అలకబూనారనే టాక్‌ కూడా వినిపిస్తోంది.

 

అయితే బ్రాహ్మణి నిజంగా పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తున్నారో లేదో తెలియదు కానీ, సోషల్‌ మీడియాలో మాత్రం బ్రాహ్మణి వర్సెస్‌ భారతి అనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి జగన్‌ జైలుకెళ్లడం ఖాయమని, అందుకే భారతిని రంగంలోకి దించుతున్నారనే టాక్‌ నడుస్తోంది. టీడీపీకి మెయిన్‌ ఛరిష్మా లీడర్‌ చంద్రబాబే అయినా... ఆ కుటుంబం నుంచి లేడీ పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తే... తెలుగుదేశానికి తురుపుముక్కగా మారే అవకాశం కచ్చితంగా ఉంటుంది. ఆ లెక్కన భారతి వర్సెస్‌ బ్రాహ్మణిగా ఏపీ రాజకీయాలు సాగినా ఆశ్చర్చపోనవసరం లేదు.

 

బ్రాహ్మణికి కావాల్సినన్ని లీడర్‌ షిప్‌ క్వాలిటీస్‌ ఉన్నాయి. ఇప్పటికే హెరిటేజ్‌ కంపెనీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్న బ్రాహ్మణి... పార్టీ నిర్వహిస్తోన్న ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌, స్కాలర్‌‌షిప్‌, జాబ్‌మేళా వంటి కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. అంతేకాదు  బ్రాహ్మణి సైలెంట్‌గా పని చేసుకుపోతారని, చాప కింద నీరులా చొచ్చుకెళ్తారన్న పేరు ఉంది. పైగా క్లీన్‌ ఇమేజ్‌, నారా, నందమూరి కుటుంబాల నుంచి రావడంతో బ్రాహ్మణికి ప్రజలు బ్రహ్మరథం పడతారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇటు వైఎస్‌ భారతి కూడా సాక్షి పత్రికను, సాక్షి టీవీని సమర్ధంగా నిర్వహిస్తూ శెభాష్‌ అనిపించుకుంటున్నారు. దాంతో ఇద్దరూ వచ్చే ఎన్నికల్లో పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తే... బ్రాహ్మణి వర్సెస్‌ భారతిగా ఏపీ రాజకీయాలు సాగినా ఆశ్చర్యపోనవసరం లేదు.