అమరావతా..? మయసభా..?

ఏపీలో బీజేపీకి నూకలు చెల్లిపోయే కాలం దగ్గరపడింది. అందుకే ఆ పార్టీ నేతలు ఏం.. మాట్లాడుతున్నాం.. ఎలా మాట్లాడుతున్నాం అన్న ఇంగిత జ్ఞానం కూడా మరిచిపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏపీకి కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం చేసింది కాక.. మళ్లీ అనవసరమైన ప్రేలాపనలకు కూడా దిగుతున్నారు. ఒక పక్క మాకు అన్యాయం జరిగింది.. మా రాష్ట్రం అభివృద్ది చేసుకుంటాం.. మాకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వండ్రా బాబు అంటే దానిని కూడా ఎగతాళి చేస్తారు.

 

ఇప్పుడు తాజాగా మరో బీజేపీ ప్రతినిధి కూడా అలాంటి మాటలే మాట్లాడారు. అమరావతి నిర్మాణానికి 43 వేల కోట్ల రూపాయలతో ఒక నివేదిక తయారు చేసి పంపించింది రాష్ట్రప్రభుత్వం. మరి దానికి నిధులు ఇస్తామో..? లేక..? ఇవ్వలేమో చెప్పాలి.. అలా కాకుండా... అమరావతిలో మయసభ ఏమన్నా కడ్తున్నారా..? 43 వేల కోట్లు రాజధానికి అవసరమా బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అవహేళనగా మాట్లాడి ఏపీ ప్రజలను మరింత ఆగహ్రానికి గురిచేశారు. దీంతో నరసింహారావు పై అందరూ మండిపడుతున్నారు. 


అంతేకాదు...అహ్మదాబాద్లో ఒక కన్వెన్షన్ సెంటర్ కు 1500 కోట్లు, పటేల్ విగ్రహానికి 2500 కోట్లు, శివాజీ విగ్రహానికి 4 వేల కోట్లు, అవసరమైన మీకు ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఎంత అవసరమో తెలియదా ? అని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ఇంకా ఇలానే మాట్లాడితే కాంగ్రెస్ కు పట్టిన గతే ఈ పార్టీకి కూడా పడుతుందని అంటున్నారు. ఆనాడు తలుపులు మూసేసి అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ కు ఏపీ ప్రజలు ఎలా బుద్ది చెప్పారో ఎవరూ మర్చిపోరు. ఇలానే విర్రవీగి ఇప్పుడు పాతాళంలో ఉంది. ఇప్పుడు మీ వంతు వచ్చింది అని అంటున్నారు. మరి నిజంగానే బీజేపీకి టైం దగ్గర పడినట్టు ఉంది... అందుకే ఇలాంటి కూతలు కూతున్నారు పార్టీ నేతలు..