తెలంగాణపైకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్న బీజేపీ...

తెలుగు రాష్ట్రాల్లో ఎలాగైనా పాగా వేయాలన్నది బీజేపీ టార్గెట్. అందుకోసం శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. అయితే, ఏపీతో పోల్చితే తెలంగాణలో పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో అధికారం కోసం సకల అస్త్రాలను ప్రయోగిస్తోంది. ఇప్పటివరకు రకరకాల ప్రయోగాలు చేసిన బీజేపీ... ఇప్పుడు అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీస్తోంది. తెలంగాణ జనాభాలో సగ భాగమున్న బీసీలే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతోంది. బీసీలను ఆకట్టుకుంటే చాలు... అధికారం దక్కించుకోవచ్చన్న నిర్ణయానికి వచ్చిన బీజేపీ... బీసీ అస్త్రాన్ని ప్రయోగించి వచ్చే ఎన్నికల నాటికి బలపడాలనుకుంటోంది. 

గతంలో టీడీపీకి బీసీలే వెన్నుముఖగా నిలిచారు. అయితే, తెలంగాణలో తెలుగుదేశం దాదాపు కనుమరుగు కావడంతో బీసీ వర్గాన్ని మొత్తం తమవైపు తిప్పుకోవాలని భావిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బీసీ వర్గంపైనే దృష్టిపెట్టి వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తుండటంతో... అంతకు మించిన వ్యూహంతో బలహీనవర్గాలను తనవైపు తిప్పుకునేందుకు కాషాయ పార్టీ వ్యూహరచన చేస్తోంది. ముఖ్యంగా బీజేపీలో బీసీలకు కల్పిస్తోన్న ప్రాధాన్యతను ప్రజల ముందు పెట్టేందుకు సిద్ధమవుతోంది. స్వయంగా ప్రధాని నరేంద్రమోడీయే బీసీ కావడంతో దాన్ని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటోంది. ఇక, తెలంగాణ గవర్నర్ గా బీసీ అయిన తమిళిసైని నియమించామని, అలాగే, తెలంగాణ బీసీ అయిన దత్తాత్రేయను హిమాచల్‌ గవర్నర్‌గా పంపి... బీజేపీలో బీసీలకు పెద్దపీట వేశామని జనంలోకి వెళ్లనున్నారు. ఇక, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బీసీ అయిన లక్ష్మణ్ నే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బీసీలకు పెద్దపీట పేరుతో అధికార టీఆర్ఎస్ తో అన్ని పార్టీల్లోని బీసీ నాయకులను పెద్దఎత్తున బీజేపీలోకి లాగాలనేది కాషాయదళం వ్యూహం తెలుస్తోంది. అంతేకాదు 2024లో బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని దాదాపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి, మున్సిపల్ ఎన్నికల్లోనే ఈ బీసీ మంత్రాన్ని ప్రయోగిస్తారో లేక అసెంబ్లీ ఎన్నికల నాటికి బీసీ జపం చేస్తారో... అసలు బీజేపీ బీసీ మంత్రం వర్కవుట్ అవుతుందో లేదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.