పొత్తుపై ముందు.. వెనక



 

టీడీపీతో పొత్తు విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు తర్జనభర్జన పడుతున్నారు. తెలంగాణలో ఆ పార్టీతో కలిసి సాగాలా.. వద్దా? అన్నది తేల్చుకోలేకపోతున్నారు. ఈ ప్రాంతంలో టీడీపీ బలహీనపడిందని, పొత్తు లాభదాయకం కాదని ఓ వర్గం వాదిస్తుండగా.. టీడీపీ మద్దతుతో ఎక్కువ సీట్లు సాధించవచ్చునని మరో వర్గం అభిప్రాయపడుతోంది. ఈ మేరకు శుక్రవారం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ప్రకాశ్ జవదేకర్ వద్ద తెలంగాణ కమలనాథులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. పార్టీ హైదరాబాద్ నగర శాఖ పొత్తుకు అనుకూల అభిప్రాయాన్ని చెప్పగా, జిల్లాల నుంచి వచ్చిన నేతల్లో ఎక్కువ మంది పొత్తు వద్దని స్పష్టం చేశారు.

 

జనసేన పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ బీజేపీకి అనుకూలంగా ఉన్నందున దేశంతో పొత్తు అవసరం లేదని కొందరు యువనేతలు వ్యాఖ్యానించారు.మరికొందరు ఎలాంటి నిశ్చితాభిప్రాయాన్ని వ్యక్తం చేయకుండా నిర్ణయాన్ని పార్టీ అగ్ర నాయకత్వానికే వదిలిపెట్టారు. ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఎదురవడంతో జవదేకర్ ఒకింత అసహనం ప్రదర్శించారు. తమిళనాడులో ఐదు పార్టీలతో కూటమిగా మారామని, ఇక్కడ మాత్రం ఇంత అయోమయం ఎందుకన్నట్టుగా వ్యాఖ్యానించారు. స్థానిక నేతలు స్పష్టమైన అభిప్రాయానికి రానిపక్షంలో జాతీయ నాయకత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. రెండు రోజుల్లో పొత్తు విషయాన్ని తేల్చేస్తామని ప్రకటించారు.