ఇండియాలో... ఎక్కువ డబ్బున్నోళ్లు ఎక్కువ మంది ఎక్కుడున్నారో తెలుసా?

ఊళ్లలో వుండే వారికి స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. శుద్ధమైన నీరు వుంటుంది. కలుషితం కాని ఆహారం దొరుకుతుంది. మనిషి బతకటానికి ఇవి మూడు కాకుండా ఇంకేం కావాలి? నిజానికి ఏమీ అక్కర్లేదు! కాని, ఈ ఆదునిక కాలంలో డబ్బు అన్నిటికంటే ప్రముఖంగా కావాలి. ఆ డబ్బు ఎక్కువగా దొరికేది నగరాల్లోనే. ఇంకా సమృద్దిగా దొరికేది మహానగరాల్లోనే. అందుకే, రోజూ కొన్ని లక్షల మంది ప్రశాంతమైన గ్రామాల్ని వదిలి సిటీల బాట పడుతుంటారు. వలస కూలీల వద్ద నుంచీ కోటీశ్వరుల దాకా అందరిదీ ఇదే అవస్థ... 

 


నగరాల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే దేశంలోని సంపదంతా నగరాలు, మహానగరాల్లోనే పోగైపోతుందా అనేలా కొన్ని ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి ఒక సర్వేలో! నేషనల్ వెల్త్ వాల్డ్ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఒక్కో నగరంలో ఎంత మంది బలియనీర్లు, ఎంత మంది మిలియనీర్లు వుంటున్నది బయటపడింది. ఆ లెక్కలు చూస్తే సిటీల్లో సంపద ఎంతగా పెరిగిపోతోందో మనకు ఇట్టే అర్థమైపోతుంది! ఇండియా మొత్తంలో అత్యధిక సంపద పోగై వున్న నగరం ముంబై! లక్ష్మీ దేవీ ధనాగారంలో వెలిగిపోతోంది మన ఆర్దిక రాజధాని. ఇక్కడ 28బిలియనీర్లు, 46వేల మంది మిలియనీర్లు వున్నారట! తరువాతి స్థానంలో 18మంది బిలియనీర్లు, 23వేల మంది మిలియనీర్లతో ఢిల్లీ రెండో ర్యాంక్ లో వుంది! ఇక మూడో స్థానం చెన్నై, కోల్ కతాలది కాదు. వాటి తరువాత అభివృద్ధి అయిన బెంగుళూరుది! అక్కడ 8మంది బిలియనీర్లు, 7వేల 700మంది మిలియనీర్లు వున్నారట!

 


బిలియనీర్లు, మిలియనీర్ల సంఖ్యలో వేలాది కోట్ల సంపదతో... అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో వున్నాయి కోల్ కతా, చెన్నై, పూణే, గుర్గ్రామ్ నగరాలు! మన భాగ్య నగరం భాగ్యవంతుల లిస్ట్ లో నాలుగో స్థానం ఆక్రమించింది. మన దగ్గర 6 మంది బిలియనర్లు వుంటే, 9 వేల మంది మిలియనీర్లు వున్నారట! ఇన్ని వేల మంది కోటీశ్వరులు కోట్లు వేసుకుని హడావిడి చేస్తున్నారు కాబట్టే హైద్రాబాద్ కార్లతో కళకళలాడిపోతోంది! షాపింగ్స్ మాల్స్ కౌంటర్లతో వెలిగిపోతున్నాయి! 

 


నగరాల్లో వేలాది కోట్లున్న కుబేరులు నివాసం వుండటం అత్యంత సహజం. కాని, రోజు రోజుకీ నగరాలు ధనికంగానూ, దేశానికి వెన్నెముక లాంటి గ్రామాలు పేదగానూ మారిపోతుండటం ఆందోళన కలిగించే విషయం. గ్రామాల నుంచి జనం వలస రాకుండా, నగరాల్లో మాదిరిగానే అక్కడా కోటీశ్వరులు, లక్షాధికారుల సంఖ్య పెరిగేలా చేయగలిగితే... భారతదేశం నిజంగా అభివృద్ధి చెందుతుంది! లేదంటే తలనొప్పితో బాధపడుతోన్న రాజు నెత్తిన బంగారు కిరీటం పెట్టుకున్నట్టు... బరువు తప్ప సుఖం ఎంత మాత్రం మిగలదు!