టీఆర్ఎస్ కు ఊహించని షాక్.. చెల్లని నాణేలు గెలిచాయి

 

తెలంగాణలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కేసీఆర్ కు.. లోక్ సభ ఎన్నికల ఫలితాలు గట్టి షాక్ ఇచ్చాయనే చెప్పాలి. లోక్ సభ ఎన్నికల్లో మిత్రపక్షం ఎంఐఎంకు ఒక సీటు పోగా.. మిగిలిన 16 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా టీఆర్ఎస్ 'సారు.. కారు.. పదహారు(16)' అంటూ ప్రజల్లోకి వెళ్ళింది. కానీ తీరా ఫలితాలు మాత్రం 'సారు.. కారు.. అర్థ పదహారు(8)' గా వచ్చేలా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణలో అంతగా ప్రభావం చూపలేవని టీఆర్ఎస్ భావించింది. కానీ టీఆర్ఎస్ అంచనాలను తారుమారు చేస్తూ కాంగ్రెస్, బీజేపీలు చెరో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుంటున్నాయి.

రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేకపోయారు. అలాంటి వారు లోక్ సభ ఎన్నికల్లో గెలుస్తారా? అని టీఆర్ఎస్ తక్కువ అంచనా వేసింది. కేటీఆర్ అయితే అక్కడ చెల్లని నాణేలు ఇక్కడ చెల్లుతాయా అంటూ కాంగ్రెస్ నేతలను ఎద్దేవా చేసారు. కానీ ఇప్పుడు ఆ చెల్లని నాణేలే గెలిచి టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చాయి. మల్కాజగిరి నుంచి రేవంత్, భువనగిరి నుంచి కోమటిరెడ్డి గెలిచారు. అదేవిధంగా నల్గొండ ఎంపీ బరిలో నిలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా గెలవలేరని టీఆర్ఎస్ అంచనా వేసింది. నిజంగా ఆయనకు గెలుపుపై నమ్మకం ఉంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి పోటీ చేసేవారని ఎద్దేవా చేసారు. కానీ ఉత్తమ్ మాత్రం సైలెంట్  గా గెలిచి చూపించారు. చేవెళ్ల నుంచి బరిలోకి దిగిన కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా గెలిచేలా ఉన్నారు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ ఖాతాలో నాలుగు ఎంపీ సీట్లు చేరే అవకాశముంది.

ఇక తెలంగాణలో బీజేపీ ఎవరి ఊహలకు అందని ఫలితాలు సాధించిందనే చెప్పాలి. ఏకంగా నిజామాబాద్ బాద్ లో కేసీఆర్ కూతురు కవితకు షాక్ ఇవ్వడమే కాకుండా.. కరీంనగర్, ఆదిలాబాద్, సికింద్రాబాద్ స్థానాలను కూడా తన ఖాతాలో వేసుకుంది. మొత్తానికి కాంగ్రెస్, బీజేపీ లు తెలంగాణలో చెరో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకొని.. టీఆర్ఎస్ 'సారు.. కారు.. పదహారు'కు బ్రేకులు వేసేలా ఉన్నాయి.