చంద్రబాబు.. లోకేష్ అయిపోయారు… ఇప్పుడిక వైసీపీ టార్గెట్ బ్రాహ్మణి!

ఎన్నికలకి ఇంకా ఎంత టైముంది? ఏపీ అసెంబ్లీ ఎన్నికలకైతే చాలా నెలలే వుంది. వచ్చే వేసవిలోగానీ ఆంధ్రలో ఎలక్షన్ హీట్ రాజుకోదు. కానీ, వైసీపీ నేతల జోరు చూస్తుంటే రేపే ఓటింగ్ అన్నట్టు వుంది! మరీ ముఖ్యంగా, ఈడీ వారి ఛార్జీషీట్ లో భారతీ పేరు అంటూ సాగుతోన్న తాజా వివాదంలో వాళ్ల తొందర మరీ తీవ్రంగా వుంది. వైసీపీ నేతలు రోజుకొకరు చంద్రబాబు పై విరుచుకుపడుతున్నారు. వారు రోజూ చేసేది అదే కదా అంటారా! అదీ నిజమే! కానీ, ఇక్కడ ఇప్పుడు లేటెస్ట్ ట్విస్ట్ ఏంటంటే… జగన్ పార్టీ వారు చంద్రబాబు ఫ్యామిలీని కూడా టార్గెట్ చేస్తున్నారు. పాలిటిక్స్ తో పెద్దగా సంబంధాలు లేని జగన్ భార్య భారతి పేరు వివాదంలోకి రావటంతో ప్రతి దాడితో భాగంగా చంద్రబాబు ఇంటిలోని వార్ని రచ్చకీడుస్తున్నారు.

 

 

జగన్ తరుఫున రోజుకో సారి టీడీపీపై విరుచుకుపడే వారి గురించి కొత్తగా చెప్పేదేం లేదు. అలాగే, కేబినేట్ లో మంత్రిగా కూడా వున్నారు కాబట్టి లోకేష్ గురించి కూడా ఇటు జగన్, అటు పవన్ వీలున్నప్పుడల్లా తలాతోకాలేని విమర్శలు చేస్తూనే వుంటారు. ఇక రోజా లాంటి వారి నోటి గురించైతే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలు! కాగా ఈ కోవలో మరో వైఎస్ కుటుంబ వీరాభిమాని వచ్చి చేరారు. అతనే… భూమన కరుణాకర్ రెడ్డి. ఈయన జగన్ కు ఎంత దగ్గరి వాడో ఇప్పుడు ప్రత్యేకంగా తెలుగు వారికి చెప్పక్కర్లేదు కదా…

 

భూమన తాజా ఆరోపణల ప్రకారం నారా బ్రాహ్మణి జీతం 9కోట్లు! ఏంటి ఈ ఆరోపణకి ఆధారం? ఏమో దేవుడికే తెలియాలి! అసలు వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధానికి… బాలకృష్ణ కూతురు, చంద్రబాబు కోడలైన బ్రాహ్మణికి ఏంటి సంబంధం? సూటిగా చెప్పుకుంటే ఏమీ లేదు! కానీ, భూమన ఆమెను కూడా గొడవలోకి లాగారు. ఎందుకంటే, టీడీపీ వారు జగన్ భార్య భారతి పేరు చార్జీషీట్లో వుందని వ్యాఖ్యానించారు కాబట్టి. కానీ, వైఎస్ భారతి పేరు ఈడీ ఛార్జీషీట్లో చేర్చిందని మొదట చెప్పింది ఎవరు? మీడియా! దానికి టీడీపీ నేతలుగానీ, చంద్రబాబుగానీ ఎలా బాధ్యులు అవుతారు? వైసీపీ ఇవేవీ పట్టించుకోవటం లేదు. భారతి అవినీతికి పాల్పడలేదని గట్టిగా చెప్పకుండా మీడియాని, టీడీపీని టార్గెట్ చేస్తోంది. తన కుటుంబాన్ని కూడా వివాదాల్లోకి లాగుతున్నారని జగన్ వాపోతున్నారు. కానీ, ఆయన అలా మాట్లాడుతూ లేఖ రాసిన రెండు రోజుల్లోనే భూమన బ్రాహ్మణిని వివాదంలోకి తెచ్చారు! ఇదేం న్యాయం?

 

 

భూమన కరుణాకర్ రెడ్డి ఈడీ అధికారుల్ని కూడా వదల్లేదు. ఎవరో ఉమాశంకర్ గౌడ్, గాంధీ అనేవారు చంద్రబాబు మనుషులు అన్నారు. వారే కోర్టుకు కూడా వెళ్లక ముందే పత్రాల్ని చంద్రబాబుకు అందించారని తీవ్ర ఆరోపణలు చేశారు. అసలు ఇదంతా ఎందుకు? ఒకవైపు నారా బ్రాహ్మణిని, మరోవైపు ఈడీ అధికారుల్ని రచ్చలోకి లాగటం ఎందుకు? బ్రాహ్మణికి హెరిటేజ్ లో 9కోట్లు జీతం వుంటే అదేమైనా నేరమా? ఈడీ అధికారులు తప్పు చేస్తే నిరూపించి వారిపై చర్యలు తీసుకునేలా చేయవచ్చు కదా? వైఎస్ కాలంలో ఎంత మంది అధికారుల్ని ఒత్తిడి తెచ్చి రకరకాల పనులకి వాడుకున్నారు! మీకు తెలియని విద్యలంటూ ఏం లేవు కదా! ఇప్పుడు భూమన చెబుతోన్న ఈడీ ఆఫీసర్స్ అలాగే తమకున్న పవర్ ని దుర్వినియోగం చేస్తుంటే వార్ని చట్టబద్ధంగా బోనులో నిలపవచ్చు కదా! అవేవీ చేయకుండా ప్రెస్ మీట్ పెట్టి మీడియాకు బ్రేకింగ్ న్యూస్ లు అందించటం ఎందుకు?

 

చంద్రబాబు కుటుంబాన్ని కూడా వివాదంలోకి లాగటం కేవలం దృష్టి మరల్చే వ్యూహంగానే భావించవచ్చు. అసలే ఆ మధ్య చేసిన కాపు రిజర్వేషన్ కామెంట్స్ తో జగన్ ఇబ్బందికర స్థితిలో వున్నారు. అంతలోనే ఎదురైన భారతి పేరు వివాదం దాన్ని కాస్త పక్కకు తోసింది. ఇప్పుడు చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేసి టీడీపీని రెచ్చగొట్టడం వల్ల కాపు రిజర్వేషన్ గొడవ పూర్తిగా సమసిపోవచ్చు. పనిలో పనిగా భారతి పేరు రచ్చకొచ్చినందుకు బ్రాహ్మణి పేరు కూడా ప్రచారంలోకి వస్తే … దానికి ఇది చెల్లు అన్నట్టుగా వుంటుంది! ఇదీ వైసీపీ మైండ్ గేమ్! ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఇలాంటివి ఇంకా బోలెడు చూడొచ్చు మనం…