ఆటోలకు పది కోట్ల బడ్జెట్!!

 

 

 

ఎన్నికల కాలం కావడంతో ఆటోరిక్షాలకు భలే గిరాకీ మొదలైంది. పట్టణాలు, నగరాల్లో భారీ ఫ్లెక్సీలు పెట్టడానికి ఎన్నికల నిబంధనలు అంగీకరించవు. ఎక్కడ ఏ పార్టీ వాళ్లు ఫ్లెక్సీలు పెట్టినా సరే ఆయా మునిసిపాలిటీల సిబ్బంది తొలగించేస్తున్నారు. దాంతో నాయకులు సరికొత్త మార్గం కనిపెట్టారు. ఆటోలకు వెనుక భాగంలో మొత్తం తమ పోస్టర్లు, ఫ్లెక్సీలు అతికించి వాటిద్వారా ఎంతోకొంత ప్రచారం చేసుకుంటున్నారు.

 

ఇంతకుముందు కూడా వాణిజ్య ప్రకటనలకు ఆటోలను విరివిగా ఉపయోగిస్తున్నారు. వాటికి అలా ప్రకటనల బోర్డులు అతికించినందుకు ఆటోవాలాలకు నెలకు 100 రూపాయల నుంచి 300 వరకు ఇచ్చేవారు. అయితే, ఎన్నికల సీజన్ కావడం, ఒకేసారి అన్ని ఎన్నికలూ రావడంతో ఆటోవాలాలు కూడా రేటు పెంచేశారు. సగం వరకే అయితే 500, మొత్తం వెనకభాగం అంతా అయితే 1000 ఇవ్వాలని పట్టుబడుతున్నారు. నాయకులు కూడా సరేనని అంతా ఇచ్చేస్తున్నారు. నగరాన్ని బట్టి కనీసం 10వేల వరకు ఆటోలుంటాయి. అంటే, అన్ని పార్టీలకు కలిపి కేవలం ఈ ఆటోల బడ్జెట్టే 5 నుంచి 10 కోట్ల వరకు అవుతుందన్న మాట!!