ఉచితం దుర్వినియోగం... చెలరేగిపోతున్న మాఫియా...

 

ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ఇసుక పాలసీ దుర్వినియోగమవుతోంది. ప్రజలకు ఉచితంగా లభించాల్సిన ఇసుక.... అక్రమంగా రాష్ట్ర సరిహద్దులు దాటుతోంది. పేద మధ్యతరగతి ప్రజలపై భారం పడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని తీసుకొస్తే..... దాన్ని అనుకూలంగా మార్చుకుంటున్న ఇసుక మాఫియా..... అక్రమంగా ఇసుకను తోడేస్తూ కోట్లు గడిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన 406 ఇసుక రీచ్‌లతోపాటు, నదుల్లోని ఇసుక మేటలు మాఫియాకి వరంగా మారుతున్నాయి. కర్నూలు జిల్లా హంద్రీ నదిలో ఏకంగా మూడు కిలోమీటర్ల మేర రోడ్డు వేసి మరీ, హైదరాబాద్‌, బెంగళూరులకు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. అలాగే అనంతపురం జిల్లాలో పెన్నానది.... గుంటూరు, కృష్ణాజిల్లాల్లో కృష్ణానది... శ్రీకాకుళం జిల్లాలో  నాగావళి, చిత్రావతి.... చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదుల్లో ఇసుక అక్రమ రవాణా యధేచ్చగా కొనసాగుతోంది.

 

ఇసుక రాష్ట్ర సరిహద్దులు దాటిపోతుంటే అడ్డుకోవాల్సిన నోడల్‌ ఆఫీసర్లు, ఇతర యంత్రాంగం.... పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించకపోవడం వల్లే ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నామని అధికారులు అంటున్నారు. అయితే ఇసుక మాఫియాకి వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా ఏర్పేడులో ధర్నా చేస్తోన్న రైతులు, రైతు కూలీలపై ఇసుక లారీ దూసుకురావడం, 17మంది చనిపోవడం, ఈ ప్రమాదంలో కుట్ర ఉందంటూ స్వయంగా మాజీ మంత్రి బొజ్జలతోపాటు పలువురు అధికార పార్టీ నేతలు సైతం వ్యాఖ్యానించారంటే, ఇసుక మాఫియా ఎంతకు తెగించిందో తెలుసుకోవచ్చు.

 

ఏర్పేడు ఘటనతో అప్రమత్తమైన ముఖ్యమంత్రి చంద్రబాబు... ఇసుక మాఫియాపై దృష్టిపెట్టారు. ఏర్పేడు ఘటనపై విచారణకు ఆదేశిస్తూనే, ఇసుక ఇసుక మాఫియా నడిపిస్తున్నారంటూ రైతులు, రైతు కూలీలు ఆరోపిస్తున్న టీడీపీ లీడర్లు ధనుంజయనాయుడు, చిరంజీవినాయుడులను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. అంతేకాదు ఇసుకను అత్యవసర వస్తువుల చట్టం కిందకి తీసుకొస్తామన్న చంద్రబాబు.... ఇసుకను అక్రమంగా నిల్వచేసేవారిపై పీడీ యాక్ట్‌ కింద కేసు పెడతామని హెచ్చరించారు.