ఏపీకి కొత్త గవర్నర్ గా ఒడిశా మాజీ మంత్రి

 

 

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు నుండి గవర్నర్ గా ఉన్న నరసింహన్, తెలంగాణ ఏపీ గా విడిపోయిన తరువాత కూడా ఆయనే ఉమ్మడి గవర్నర్ గా దాదాపు పదేళ్లుగా కొనసాగుతూ వస్తున్నారు. ఐతే రెండు తెలుగు రాష్ట్రాలకు వేరువేరుగా సీనియర్  బీజేపీ నేతలను గవర్నర్లుగా  నియమిస్తారని  వార్తలు వచ్చినప్పటికీ ఇంతవరకు నియామకాలు మాత్రం జరగలేదు. తాజాగా కేంద్రం ఏపీకి కొత్త గవర్నర్ ను నియమించింది. ఒడిశాకు చెందిన ప్రముఖ న్యాయవాది, మాజీ మంత్రి బిశ్వ భూషణ్ హరిచందన్ ను గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజుల్లోగా ఆయన ఏపీ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని గవర్నర్ నివాసంగా ఉపయోగించేందుకు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. బిశ్వ భూషణ్ హరిచందన్ ఒడిశా బీజేపీ అధ్యక్షుడిగా  1980 నుంచి 1988 వరకు వ్యవహరించారు. అయన గతంలో జనసంఘ్, జనతాపార్టీల్లో పని చేశారు. ఆయన సుదీర్ఘకాలం ఒడిశాలో ప్రజాప్రతినిధిగా పని చేశారు. ఒడిశాలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పని చేశారు. బీజేపీ బీజేడీ ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. హరిచందన్ కు సాహిత్యం అంటే చాల ఇష్టం. ఒడియా భాషలో ఆయన పలు రచనలు చేశారు.