తెలంగాణ రైతుపై ఏపీ మంత్రి దౌర్జన్యం.. బూతులు తిడుతూ దాడి!!

తెలంగాణకు చెందిన ఓ రైతుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మనుషులు దాడి చేశారనే వార్త వివాదాస్పదమవుతోంది. పెద్దిరెడ్డికి చెందిన పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ కంపెనీ.. తెలంగాణలో అనేక కాంట్రాక్టులు చేస్తోంది. వాటిలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన బస్వాపూర్‌ రిజర్వాయర్‌ కూడా ఒకటి. అయితే తాజాగా పెద్దిరెడ్డి ప్రాజెక్ట్ పనులను పరిశీలించేందుకు అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో.. ఓ రైతు తమ భూమిని తీసుకున్నందుకు పరిహారం చెల్లించాలని కోరాడు. దీంతో ఎవడ్రా నువ్వు అంటూ మంత్రి కోప్పడ్డాడు. మంత్రి గన్‌మెన్‌, కంపెనీ ఉద్యోగులు దుర్భాషలాడుతూ రైతుపై మూకుమ్మడిగా దాడి చేశారు.

యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బస్వాపూర్‌ వద్ద 11.39 టీఎంసీల రిజర్వాయర్‌ నిర్మిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం.. భూ సేకరణలో భాగంగా.. బస్వాపూర్‌కు చెందిన ఉడుత సత్తయ్య, ఉడుత నర్సింహ, ఉడుత యాదయ్య కుటుంబాలకు చెందిన భూమిని పూర్తిగా స్వాధీనం చేసుకుంది. కానీ, నష్టపరిహారం మాత్రం పూర్తిగా చెల్లించలేదు. మరో 21 ఎకరాల భూమికి నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంది. ఆ పరిహారం కోసం నిర్వాసితులు రెండు, మూడేళ్లుగా అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు. కళ్లు కాయలు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే, అధికారుల నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదు. 

దీంతో.. పరిహారం చెల్లించే వరకు ప్రాజెక్ట్ పనులు చేయనివ్వకుండా అడ్డుకోవాలని నిర్వాసితులు నిర్ణయించుకొని.. ఆదివారం ఉదయం పనులు చేస్తున్న ప్రదేశానికి వెళ్లారు. అప్పుడే నిర్మాణ సంస్థకు చెందిన పెద్దిరెడ్డి అక్కడికి వచ్చారు. ఆయనను గుర్తించిన నిర్వాసిత రైతు కుమారుడు రవి.. ‘సార్‌! మాకు నష్టపరిహారం చెల్లించలేదు.. మా భూమిలో పనులు నిలిపివేయండి’ అని కోరాడు. దాంతో మంత్రి.. ‘‘ఎవడ్రా నువ్వు.. పనులు నిలిపివేయమనడానికి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మంత్రి గన్‌మెన్‌ మరియు సంస్థకు ఉద్యోగులు రైతుని పిడిగుద్దులు గుద్దుతూ.. నానా దుర్భాషలాడుతూ వంద అడుగుల దూరం ఈడ్చుకువెళ్లారు. నిస్సహాయ స్థితిలో ఆ రైతు తన చేతికి అందిన మట్టి పెడ్డను విసిరాడు. దాంతో, ప్రాజెక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న శశి అనే వ్యక్తి చెవికి గాయమైంది. అతడిని వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా, తమ భూమికి న్యాయంగా రావాల్సిన పరిహారం కోరితే దాడికి పాల్పడి దౌర్జన్యం చేశారని బాధిత రైతు రవి ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. మంత్రికి చెందిన కంపెనీ ఉద్యోగిపై మట్టి పెడ్డతో దాడి చేసినందుకు.. నీపైనే కేసు పెడతారు అంటూ రైతుని బెదిరించినట్లు సమాచారం.