ఈసీ విఫలం.. వైసీపీకి అనుకూలం

 

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరాను చంద్రబాబు కలిశారు. గంటన్నర పాటు సీఈసీతో చంద్రబాబు బృందం భేటీ అయింది. ఏపీలో పోలింగ్ తీరు, ఈవీఎంల ఇబ్బందులపై ఈసీకి ఫిర్యాదు చేశారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం విఫలమైందని లేఖ ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో ఈసీ జోక్యం చేసుకుందని, ప్రభుత్వ అధికారాలను అణచివేశారని మండిపడ్డారు. ఏ కారణం లేకుండా అధికారులను బదిలీ చేశారని, టీడీపీ ఫిర్యాదులను ఈసీ పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. ఏకపక్ష నిర్ణయాలతో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే స్పందించలేదని మండిపడ్దారు. ఈవీఎంలను మరమ్మతు చేసే వారి అర్హతలేమిటని చంద్రబాబు ప్రశ్నించారు.

ఏపీ చరిత్రలో ఇన్ని అరాచకాలు ఎప్పుడూ లేవని చంద్రబాబు అన్నారు. ఏపీ ప్రజలపై మూకుమ్మడిగా దాడి చేశారని దుయ్యబట్టారు. మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో తప్పించుకోవడానికి కడప ఎస్పీని బదిలీ చేశారని ఆరోపించారు. చీరాల వైసీపీ అభ్యర్థి చెబితే సాయంత్రానికి సీఎస్‌ని బదిలీ చేశారని, రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్‌ను నిర్వీర్యం చేయాలని చూశారని ధ్వజమెత్తారు. అభ్యర్థులు, స్పీకర్‌పై దాడులు చేశారని.. ఆంధ్రప్రదేశ్‌ని రావణకాష్టంగా మార్చాలనుకున్నారని మండిపడ్డారు.
 
‘50శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలని ఈసీని కోరాం. మా వినతికి ఈసీ అంగీకరించలేదు. వీవీప్యాట్ల లెక్కింపునకు 6 రోజులు పడుతుందని ఈసీ చెప్తోంది. బ్యాలెట్‌ విధానంలో ఒక్కరోజులో లెక్కింపు పూర్తయ్యేది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది. రాజ్యాంగ వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు. సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించారు. ఈవీఎంలపై చాలా కాలంగా పోరాడుతున్నాం. ప్రజల ప్రాథమిక హక్కును కాపాడటంలో ఈసీ విఫలం అయింది’ అని చంద్రబాబు విమర్శించారు.